హైదరాబాద్: హోటల్‌లో అగ్నిప్రమాదం... వ్యక్తి సజీవదహనం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోహైల్ హోటల్ వంటగదిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. హోటల్ లో 15 మంది కస్టమర్‌లు కూడా ఉన్నారు. మంటలు, పొగను గమనించి, అందరూ హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు.
హైదరాబాద్, మలక్‌పేటలోని ఓ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ కార్మికుడు సజీవదహనమయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోహైల్ హోటల్ వంటగదిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. హోటల్ లో 15 మంది కస్టమర్‌లు కూడా ఉన్నారు. మంటలు, పొగను గమనించి, అందరూ హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు, మహ్మద్.షాహాబుద్దీన్ (33) అనే కార్మికుడు మాత్రం లోపల చిక్కుకుని స్పృహతప్పి పడిపోయి ఊపిరాడక మరణించినట్లు అనుమానిస్తున్నారు.
చాదర్‌ఘాట్ నుంచి వచ్చిన పోలీసు బృందం, మలక్‌పేట, గౌలిగూడ అగ్నిమాపక శాఖ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలను ఆర్పిన తర్వాత లోపలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి షాహబుద్దీన్ కాలిపోయిన మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన హోటల్ మలక్‌పేట-నల్గొండ క్రాస్‌రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై ఉండడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హోటల్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ప్రమాదం జరిగిన ఈ హోటల్ కు ఆనుకొని మలక్‌పేట ఏరియా ఆస్పత్రి ఉండటంతో ఆస్పత్రిలో రోగులు భయంతో వణికి పోయారు. అయితే రోగుల కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది రోగులను సురక్షితంగా ఆస్పత్రి నుంచి బైటికి తరలించారు.