Telugu Global
Telangana

Hyderabad: మూసీ, ఈసా నదులపై యూరప్ తరహా వంతెనలు

Hyderabad: మూసీ, ఈసా నదులపై యూరప్ తరహా వంతెనలు
X

యూరప్ లోని అనేక దేశాల గుండా ప్రవహించే ప్రధాన నదులలో ఒకటైన 'రైన్' నది పై ఉన్న వంతెనల స్ఫూర్తితో తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (MA&UD) విభాగం మూసీ, ఈసా నదులపై దాదాపు 14 వంతెనలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రెండు నదుల పై నిర్మించే కొత్త వంతెనలు ఆయా ప్రదేశాల చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. 'రైన్' నదిపై ఉన్న వంతెనలు, ప్యారిస్ మీదుగా ప్రవహించే నదులపై నిర్మించిన వంతెనల ఆధునికతను జోడించి తెలంగాణ ప్రభుత్వం రూ.545 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్ట‌నుందని అధికారులు తెలిపారు.

వంతెనలు ఏర్పాటవుతున్న ప్రదేశాల‌లో స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లను పొందుపరచాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి KTR నిర్ణయం తీసుకున్నారు. యూరప్‌లోని వంతెనలను అధ్యయనం చేసి, ఫ్రాన్స్‌లోని నిపుణులతో సమావేశం నిర్వహించిన‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు ఆ వివరాలను KTR కు తెలియజేశారు.

"యూరోపియన్ వంతెనలలోని ఆధునిక, సాంకేతిక అంశాలను మాత్రమే పొందుపరచాలని వాటి డిజైన్లు, థీమ్‌లను పునరావృతం చేయవద్దని మంత్రి మాకు చెప్పారు, ఎందుకంటే యూరోపియన్ వంతెనలు స్థానిక సంస్కృతిని మాత్రమే ప్రతిబింబిస్తాయి, అవి హైదరాబాద్, మూసీ నది, దాని వారసత్వానికి ప్రతిబింబించవు " అని అధికారులు అన్నారు.

ఒక్కో వంతెన ఒక్కో ఇతి వృత్తాన్ని తెలియజేసేట్టు నిర్మించనున్నాం అని అధికారులు తెలిపారు. ముసారాంబాగ్‌పై నిర్మించే వంతెన ఆ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను వివ‌రిస్తుంది. అదేవిధంగా, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్‌లోని పాదచారుల వంతెన సమీపంలోని చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను తెలియ‌జేసేట్టుగా ఉంటాయి.

మూసీ, ఈసా నదులపై 14 కట్టడాల్లో రూ.116 కోట్లతో హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మూడు వంతెనలు, రూ. 40 కోట్లతో కులీ కుతుబ్‌ షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఒక వంతెన. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.168 కోట్లతో నాలుగు వంతెనలు, మంచిరేవుల బ్రిడ్జికి లింక్ రోడ్డుతోపాటు ఆరు వంతెనలను రూ.221 కోట్లతో హెచ్‌ఎండీఏ నిర్మిస్తుంది.

First Published:  12 Dec 2022 7:42 AM IST
Next Story