Telugu Global
Telangana

సీటు బెల్ట్ లు, చార్జింగ్ పాయింట్లు, పానిక్ బటన్లు..

గతంలో ఎలక్ట్రిక్ బస్సులకు కొన్ని సీట్లకు మాత్రమే సీటు బెల్ట్ ఉండేది. ఇప్పుడది అన్ని సీట్లకు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బస్సు ఎక్కితే డ్రైవర్ తో సహా ప్రయాణికులంతా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే.

సీటు బెల్ట్ లు, చార్జింగ్ పాయింట్లు, పానిక్ బటన్లు..
X

హైదరాబాద్ రోడ్లపై E-బస్సులు పరుగులు తీయబోతున్నాయి. ఇప్పటికే విమానాశ్రయానికి 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. వీటికి మరిన్ని ఆధునిక హంగులు జోడించి కొత్తగా హైదరాబాద్ సిటీ రూట్లలో E-బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. త్వరలో హైదరాబాద్ నగరమంతా E-బస్సులు మాత్రమే ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.

ప్రస్తుతం 500 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించింది ఆర్టీసీ. తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో 20 శంషాబాద్‌ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌ లో తిరుగుతాయి. నగరంలో మెట్రో రైలు వ్యవస్థ లాగా ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రత్యేకంగా నిలుస్తాయని అంటున్నారు అధికారులు.

ప్రత్యేకతలివే..

ఈ ఎలక్ట్రిక్ బస్సుల పొడవు 12 మీటర్లు. వీటిలో 35 సీట్లు ఉంటాయి. ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ ఉంటుంది. బస్సులో 3 సీసీ కెమెరాలుంటాయి. ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ ఉంటుంది. ప్రమాదం జరిగితే వెంటనే ఈ బటన్ నొక్కేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణికుల సూచనలకోసం ఎల్ఈడీ తెరలు కూడా ఉంటాయి. ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్.. కూడా ఇందులో ఉంటాయి. గతంలో ఎలక్ట్రిక్ బస్సులకు కొన్ని సీట్లకు మాత్రమే సీటు బెల్ట్ ఉండేది. ఇప్పుడది అన్ని సీట్లకు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బస్సు ఎక్కితే డ్రైవర్ తో సహా ప్రయాణికులంతా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. అత్యాధునిక బ్యాటరీ కెపాసిటీతో ఈ బస్సులు తయారవుతున్నాయి. ఒకసారి ఫుల్‌ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్‌ చార్జింగ్‌ కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఈ బస్సుల్ని రెడీ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ సిటీ రోడ్లపై ఈ బస్సులు పరుగులు తీస్తాయి.

First Published:  8 Aug 2023 3:23 AM GMT
Next Story