Telugu Global
Telangana

విపత్తులంటే వరదలే కాదు.. హైదరాబాద్ కోసం సరికొత్త విభాగం

హైదరాబాద్‌ లో విపత్తుల నిర్వహణకోసం హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) అనే ప్రత్యేక విభాగాన్ని రంగంలోకి దించుతున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

విపత్తులంటే వరదలే కాదు.. హైదరాబాద్ కోసం సరికొత్త విభాగం
X

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నప్పుడు వెంటనే డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లు రంగంలోకి దిగుతాయి. బాధితులకు అండగా నిలబడతాయి. వరద నీరు తగ్గాక మళ్లీ షరా మామూలే. అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వరదలు రాకుండా నివారించడం, వచ్చినా తక్కువ నష్టం జరిగేలా చూడటం.. ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ పని కాదు. అందుకే దీనికోసం ప్రత్యేకంగా మరో విభాగం ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విపత్తుల నిర్వహణకు హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా) అనే ప్రత్యేక విభాగాన్ని రంగంలోకి దించుతున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.


డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ భౌగోళిక పరిధిని విస్తరించబోతున్న సందర్భంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతమే కాకుండా.. చుట్టు పక్కల ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, 33 గ్రామపంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలన్నారు. ఈ విభాగానికి డీఐజీ స్థాయి అధికారి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అదనపు డైరెక్టర్లుగా ఉంటారు.

వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందించేలా హైడ్రా విభాగాన్ని సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలను పరిరక్షించడం, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చూడటం కూడా ఈ విభాగం పనే. నగరంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ కూడా వీరి పరిధిలోకి వస్తుంది. తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలోనూ హైడ్రా సిబ్బంది సేవలందిస్తారు. ఈ విభాగానికి సంబంధించి సిబ్బంది నియామకం, నిధుల కేటాయింపుపై ముసాయిదాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో విపత్తులు రాకుండా చూసుకోవడం, ఒకవేళ అనుకోని ఉపద్రవం తలెత్తితే అక్కడికి క్షణాల్లో వెళ్లి సమస్యను పరిష్కరించడం ఈ హైడ్రా విభాగం బాధ్యత.

First Published:  2 July 2024 9:47 AM IST
Next Story