Telugu Global
Telangana

'లియో'కు షాక్.. తెలుగు వెర్షన్ విడుదలకు కోర్టు స్టే

ప్రీ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులోనూ పాజిటివ్ బజ్ ఏర్ప‌రుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా.

లియోకు షాక్.. తెలుగు వెర్షన్ విడుదలకు కోర్టు స్టే
X

తమిళ అగ్రహీరో ఇళయ దళపతి విజ‌య్‌ హీరోగా, లోకేష్ కనగరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలపై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ మూవీని విడుదల చేయవద్దని ఆదేశించింది. ఈ సినిమా టైటిల్ విషయమై తలెత్తిన వివాదం కారణంగానే కోర్టు స్టే విధించింది.

గ‌తంలో విజయ్ - లోకేష్ కాంబినేషన్‌లో వ‌చ్చిన మాస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్ట‌డంతో మ‌రోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లియో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ప్రీ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులోనూ పాజిటివ్ బజ్ ఏర్ప‌రుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అంచనా.

లియో సినిమా అక్టోబర్ 19న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వర్షన్ విడుదలకు కోర్టు స్టే విధించింది. లియో అనే టైటిల్ ని ముందు తామే రిజిస్టర్ చేసుకున్నామని.. కానీ తమ సినిమాకు పెట్టుకున్న టైటిల్‌ని విజయ్ సినిమాకు పెట్టారని కొందరు వ్యక్తులు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో లియో సినిమాను ఈనెల 20వ తేదీ వరకు విడుదల చేయవద్దని కోర్టు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. లియో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్మెంట్‌ అధినేత నాగవంశీ ఈ విషయమై మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమాను ముందు అనుకున్నట్లుగానే 19వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. లియో టైటిల్ ని కొంతమంది ముందే రిజిస్టర్ చేసుకున్న విషయం తమకు తెలియదని చెప్పారు. వారు కూడా తమ దృష్టికి తీసుకురాకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారని తెలిపారు. సదరు నిర్మాతలను సంప్రదించి సమస్యను పరిష్కరించుకొని లియో మూవీని 19వ తేదీనే విడుదల చేస్తామని నాగవంశీ ప్రకటించారు.

First Published:  17 Oct 2023 7:17 PM IST
Next Story