పదహారేళ్లకే పీజీ చేసిన హైదరాబాద్ కుర్రాడు
9 ఏళ్ల వయసులో టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి తెలంగాణలో రికార్డ్ సృష్టించాడు అగస్త్య. పధ్నాలుగేళ్లకే డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు పదహారేళ్లకే పీజీ పూర్తి చేసి దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు.
భారత్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు పదహారేళ్ల హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అతను సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. అగస్త్య ఫస్ట్ క్లాస్ లో పీజీ పూర్తి చేయడం మరో విశేషం.
అన్నీ రికార్డ్ లే..
చిన్న వయసులో పీజీ చేసి రికార్డ్ సృష్టించాడంటే, గ్రాడ్యుయేషన్ కూడా చిన్న వయసులోనే పూర్తి చేసి ఉండాలి, అంతకు ముందు ఇంటర్, టెన్త్ క్లాస్ కూడా ఇంకా చిన్న వయసులోనే పూర్తయి ఉండాలి. అవును, అగస్త్య చిన్నప్పటినుంచే రికార్డుల వేటగాడు. 9 ఏళ్ల వయసులో టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి తెలంగాణలో రికార్డ్ సృష్టించాడు అగస్త్య. పధ్నాలుగేళ్లకే డిగ్రీ కంప్లీట్ చేశాడు. మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో బీఏ పూర్తి చేశాడు ఆగస్త్య. ఇప్పుడు పదహారేళ్లకే పీజీ పూర్తి చేసి దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు.
ఎవరీ అగస్త్య..?
చిన్న వయసులోనే అత్యంత ప్రతిభ చూపెడుతున్న అగస్త్య ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సోదరుడు. నైనా జైస్వాల్ కూడా మంచి ప్రతిభావంతురాలైన విద్యార్థిని. చదువుతోపాటు ఆమె క్రీడల్లో రాణిస్తూ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఆమె సోదరుడు అగస్త్య తెలంగాణకు, తాను చదువుకున్న ఉస్మానియా యూనివర్శిటీకి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టాడు.
తల్లిదండ్రులే తనకు గురువులు అని చెప్పే అగస్త్య.. తండ్రి అశ్వనీ కుమార్ జైస్వాల్, తల్లి భాగ్యలక్ష్మి శిక్షణలో రాటుదేలాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించాడు. కేవలం 1.72 సెకన్లలో A నుండి Z వరకు అక్షరాలను టైప్ చేయగల టాలెంట్ కూడా అగస్త్య సొంతం. రెండు చేతులతో రాయగలడు. అగస్త్య కూడా అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లలో పాల్గొన్నాడు.