Telugu Global
Telangana

ఐటీ కొలువుల్లో హైదరాబాద్ మేటి.. ఎవరూ లేరు దీనికి సాటి..

తెలంగాణలో మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఐటీ రంగం అంచెలంచలుగా ఎదిగింది. టి-హబ్ పేరుతో స్టార్టప్ ల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ఇంక్యుబేటర్ ల ఏర్పాటు ఐటీరంగ అభివృద్ధికి తోడ్పడింది.

ఐటీ కొలువుల్లో హైదరాబాద్ మేటి.. ఎవరూ లేరు దీనికి సాటి..
X

భారత్ లో ఐటీ రంగం అంటే నిన్న మొన్నటి వరకూ సిలికాన్ సిటీ బెంగళూరు పేరు వినిపించేది. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక తెలంగాణలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఐటీ ఉద్యోగాల్లో ఇప్పుడు దేశంలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఐటీ విభాగంలో 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అందులో హైదరాబాద్ ది సింహభాగం. హైదరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో ఏకంగా 1.53 లక్షలమంది కొత్తగా కొలువుల్లో చేరారు. ఆ తర్వాతి స్థానం బెంగళూర్‌ది. బెంగళూరులో లక్షా 48వేల 500మందికి ఉద్యోగాలు వచ్చాయి. ముంబైలో 54వేలమంది, పూణేలో 40,500మంది, చెన్నైలోని ఐటీ కంపెనీల్లో 22,500మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఐటీరంగంలో అత్యధిక ఉద్యోగాలు సృష్టించిన నగరంగా హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఐటీ ఉత్పత్తుల్లో తిరుగులేని అభివృద్ధి..

ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ పురోగతి సాధించింది. గతేడాది 1.45 లక్షల కోట్ల ఎగుమతులు సాధించగా.. ఈ ఏడాది 1.83 లక్షల కోట్ల ఎగుమతులు ఐటీరంగంనుంచి ఉన్నాయి. మొత్తంగా ఏడాదిలో 26శాతం పురోగతి కనపడుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఈస్థాయి అంచనాలను చేరుకోలేదు.

ఐటీలో మేటి..

ఐటీ అభివృద్ధి అంటే ప్రైవేట్ రంగం అభివృద్ధి అనుకుంటారంతా, దానిలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తక్కువేననే అపోహ ఉంది. అయితే తెలంగాణలో మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఐటీ రంగం అంచెలంచలుగా ఎదిగింది. టి-హబ్ పేరుతో స్టార్టప్ ల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ఇంక్యుబేటర్ ల ఏర్పాటు ఐటీరంగ అభివృద్ధికి తోడ్పడింది. టెక్ మహీంద్రా ఎండీ సీపీ. గుర్నాని ఇటీవల.. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ చొరవని ఆయన మెచ్చుకున్నారు. ప్రభుత్వ సహకారంతోనే తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. మొత్తమ్మీద ఐటీ ఉత్పత్తుల్లోనే కాదు, ఐటీ ఉద్యోగాల్లో కూడా దేశంలోనే నెంబర్-1 స్థానానికి చేరుకుంటోంది హైదరాబాద్. భారత్ లో తమ బ్రాంచ్ లను మొదలు పెట్టాలనుకునే ఐటీ కంపెనీలు ఇప్పుడు హైదరాబాద్ ని తొలి ఛాయిస్ గా స్వీకరిస్తున్నాయి.

First Published:  2 Aug 2022 3:03 PM GMT
Next Story