Telugu Global
Telangana

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్, పూణే టాప్.. నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి

అత్యధిక విస్తీర్ణం ఉన్న కార్యాలయాల అద్దెల విషయంలో హైదరాబాద్, పూణే ముందంజలో ఉన్నట్లు తెలిపింది.

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్, పూణే టాప్.. నైట్ ఫ్రాంక్ నివేదికలో వెల్లడి
X

ఆఫీస్ స్పేసింగ్‌కు సంబంధించిన లావాదేవీల్లో విస్తీర్ణం పరంగా హైదరాబాద్, పూణే అగ్రస్థానంలో నిలిచాయి. 2022 ఏడాదికి సంబంధించి 11 లక్షల చదరపు అడుగుల కేటగిరీలో ఈ రెండు నగరాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు రియాల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన నివేదికలో వెల్లడించింది. కాగా, ఐటీ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న చోటే ఈ మేరకు లావాదేవీలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నది.

అత్యధిక విస్తీర్ణం ఉన్న కార్యాలయాల అద్దెల విషయంలో హైదరాబాద్, పూణే ముందంజలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు, నేషనల్ క్యాపిటల్ రీజియన్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా ఉన్నాయి. 2022లో కొత్తగా 51 మిలియన్ స్క్వేర్ ఫీట్ మేర అద్దెలకు ఇచ్చినట్లు పేర్కొన్నది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పూణేలో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల పెరుగుదలే దీనికి కారణమని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిరీష్ బైజాల్ తెలిపారు.

ఈ రెండు నగరాల్లో అత్యధిక విస్తీర్ణం కలిగిన కార్యాలయాలను లీజుకు తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉందని కూడా ఆయన చెప్పారు. ఆయా నగరాల్లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు పెరగడం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను నెలకొల్పడం వల్లే వీటికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ఈ ఏడాది కూడా ఇలాగే భారీ విస్తీర్ణం కలిగిన కార్యాలయాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

మరోవైపు కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో 50వేల చదరపు ఫీట్ల కార్యాలయాలకు మంచి డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబై కూడా ఈ విషయంలో ఆ రెండు నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు. అయితే తక్కువ విస్తీర్ణం కలిగిన కార్యాలయాల విషయంలో హైదరాబాద్, పూణే, బెంగళూరు నగరాల వృద్ధి వరుసగా 25 శాతం, 20 శాతం, 30 శాతంగా ఉందని నివేదికలో తెలిపారు. అయితే సంఖ్యా పరంగా చూస్తే.. అత్యధిక లావాదేవీలు బెంగళూరులో జరిగినట్లు పేర్కొన్నారు.

1 లక్ష చదరపు అడుగుల సెగ్మెంట్‌లో బెంగళూరులో 36 లావాదేవీలు జరిగితే.. హైదరాబాద్‌లో 15, పూణేలో 13 జరిగినట్లు పేర్కొన్నారు. మొత్తానికి అన్ని కేటగిరీల పరంగా అత్యధిక లావాదేవీలు హైదరాబాద్‌లో జరిగినట్లు తెలిపారు.

First Published:  25 March 2023 2:51 AM GMT
Next Story