భూగర్భ జలాల పెరుగుదలలో టాప్ 4లో హైదరాబాద్
దేశంలోని 55 నగరాలు, పట్టణాల్లో 2012 నుంచి 2022 నవంబర్ వరకు భూగర్భ జలాలకు సంబంధించిన వివరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ రాజ్యసభలో ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం నీళ్ల విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర చర్యల ఫలితం ఇప్పుడు కనపడుతోంది. జల సంరక్షణ కోసం ఇంకుడు గుంతల తవ్వకాన్ని తప్పనిసరి చేయడంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. మిషన్ భగీరథ కారణంగా ఇంటింటికీ తాగు నీటిని అందిస్తుండటంతో చాలా వరకు భూగర్భ జలాల వాడకం తగ్గింది. దీంతో పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఓ సర్వే నిర్వహించగా.. హైదరాబాద్ టాప్ 4లో నిలిచింది. నగరంలో 4 మీటర్లకు పైగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో కూడా ప్రకటన చేసింది.
దేశంలోని 55 నగరాలు, పట్టణాల్లో 2012 నుంచి 2022 నవంబర్ వరకు భూగర్భ జలాల వాడకానికి సంబంధించిన వివరాలను కేంద్ర జల్‌శక్తి శాఖ రాజ్యసభలో ప్రకటించింది. అందులో 7 మెట్రోపాలిటన్, 48 పట్టణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని 36 పరిశీలక బావుల్లో 69.4 శాతం బావుల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. కాగా, 30.6 శాతం బావుల్లో మాత్రం భూగర్భ జలాలు పడిపోయాయి. 25 శాతం బావుల్లో 4 మీటర్లకు పైగా నీటి మట్టం పెరగడం గమనార్హం.
దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల పరిశీలనలో హైదరాబాద్ మాత్రమే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుదలలో అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా, నగరంలోని 30.6 శాతం బావుల్లో జలాలు తగ్గినా.. మిగిలిన నగరాలతో పోలిస్తే.. ఇది స్వల్పమే అని నివేదికలో పేర్కొన్నారు. కేవలం 25 శాతం బావుల్లో మాత్రమే 2 మీటర్ల కంటే ఎక్కువగా నీటి మట్టం పడిపోయింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ నగరం నీటి మట్టం పెరుగుదల, తగ్గుదలలో 4వ ర్యాంకులో ఉన్నది. అగ్ర స్థానంలో చెన్నై ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. అయితే టాప్ 3 నగరాల్లో భూగర్భ జలాల పెరుగుదల 0.2 మీటర్ల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. భూగర్భ జలాల తగ్గుదలలో మాత్రం కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్ ముందు స్థానాల్లో ఉన్నాయి.