Telugu Global
Telangana

లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ మెట్రో.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్‌కు ఎలాంటి నష్టం కలుగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో అండర్ గ్రౌండ్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ మెట్రో.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
X

హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చివేసే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఇవాళ తెరలేవనున్నది. అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం (మైండ్ స్పేస్) నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ మెట్రోకు అయ్యే రూ. 6,250 కోట్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది. ఈ మెట్రో అందుబాటులోకి వస్తే ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మైండ్ స్పేస్టెక్నాలజీ పార్కులకు అత్యంత తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంటుంది.

లండన్ నగరంలో ఉన్న అత్యాధునిక మెట్రోకు ధీటుగా ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం జరుగనున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో కంటే ఇందులో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండనున్నట్లు హెచ్ఏఎంఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ మెట్రోను ఎలివేటెడ్, అండర్ గ్రౌండ్ పద్దతిలో నిర్మించనున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రో కోసం మరో ఫ్లైవోవర్ రాబోతోందని ఆయన చెప్పారు. అక్కడి నుంచి కిందకి దిగుతూ రోడ్ లెవెల్‌కి వస్తుందని.. ఓఆర్ఆర్ వెంట శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునే ముందు అండర్ గ్రౌండ్‌కు వెళ్తుందన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్‌కు ఎలాంటి నష్టం కలుగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో అండర్ గ్రౌండ్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న మెట్రో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని.. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అన్నారు. అయితే ఎక్స్‌ప్రెస్ మెట్రో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు.

రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ప్రయాణికుల కోసం బ్యాగేజ్ చెకింగ్ పాయింట్ ఉంటుందని.. ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ప్రత్యేకంగా లగేజీని మోసుకుంటూ మళ్లీ చెకింగ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పారు. మెట్రో సిబ్బందే లగేజీని ఎయిర్‌పోర్టులోకి తరలిస్తారని అన్నారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ కార్డులే ఎక్స్‌ప్రెస్ మెట్రోలో కూడా పని చేస్తాయని చెప్పారు. ముందు మూడు కోచ్‌లతో సేవలు ప్రారంభించి.. తర్వాత రద్దీని బట్టి 6 కోచ్‌లకు పొడిగిస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం కోసం ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బిడ్ సమావేశం ఇప్పటికే నిర్వహించారు. ఈ నెల 13 వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్లు స్వీకరిస్తారు. మెట్రో కోసం నియమించే జనరల్ కన్సల్టెంట్ పలు పనులు చేపడతారు. డీపీఆర్‌ను రివ్యూ చేయడం, టెండర్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్, ప్రూఫ్ చెక్స్, డిజైన్స్, డాక్యుమెంట్ కంట్రోల్, ప్రాజెక్ట్ ప్లానింగ్, కాంట్రాక్ట్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ ఆడిట్ చెక్‌తో పాటు పలు కీలక విషయాలను కన్సల్టెంట్ చూస్తారు.

First Published:  9 Dec 2022 8:49 AM IST
Next Story