Telugu Global
Telangana

ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసిన అతి వేగం

అతి వేగం ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలు తీసింది. విద్యార్థులు వెళుతున్న కారు అతి వేగం వల్ల అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు తీసిన అతి వేగం
X

అతి వేగం ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రాణాలు తీసింది. విద్యార్థులు వెళుతున్న కారు అతి వేగం వల్ల అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ శంకరయ్య శనివారం వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గల ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అక్షయ్‌ (19), అస్మిత్‌ (19), జస్వంత్, నవనీత్‌లు టీ తాగేందుకు వెళ్తున్నామని హాస్టల్‌ వార్డెన్‌కు చెప్పి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు బయటికి వచ్చారు. వారికి అక్షయ్‌ స్నేహితుడు హరి (19) జత కలిశాడు. ఐదుగురూ కలిసి కారులో దుండిగల్‌ అవుటర్‌ సర్వీస్‌ రోడ్డులో.. దుండిగల్‌ నుంచి బౌరంపేట వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో బౌరంపేట నుంచి గండి మైసమ్మ గుడి వైపు వస్తున్న ట్యాంకర్‌ను వీరి కారు బలంగా ఢీకొట్టింది. దుండిగల్‌ ఎగ్జిట్‌ నంబర్‌–5 సమీపంలో మూలమలుపు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అక్షయ్‌తో పాటు అష్మిత్, హరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జస్వంత్, నవనీత్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సూరారంలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మితిమీరిన వేగం, కారును అదుపు చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు గుర్తించామని వారు చెప్పారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న అక్షయ్‌ మృతదేహం కారులో ఇరుక్కుపోగా.. దాన్ని బయటికి తీసేందుకు గంట సమయం పట్టింది. అతనిది నిజామాబాద్‌ జిల్లా అని తెలిసింది.

First Published:  20 July 2024 7:05 AM GMT
Next Story