Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

లంచ్ మోషన్ దాఖలు చేసిన పోలీసులు అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరారు. ఈ కేసు చాలా ముఖ్యమైనదని, నిందితులను విచారించి మరిన్ని వాస్తవాలను వెలికితీయాల్సి ఉందని, కాబట్టి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు
X

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు రిమాండ్ విధించడకుండా ఏసీబీ కోర్టు విడుదల చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదంటూ, ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వచూపినట్టు ఆధారాలు కానీ, నగదు పట్టుబడినట్టు పోలీసులు ఎలాంటి సాక్షాలు చూపలేకపోయారని వ్యాఖ్యానించిన ఏసీబీ కోర్టు నిందితులను విడుదల చేసింది.

ఈనేపథ్యంలో లంచ్ మోషన్ దాఖలు చేసిన పోలీసులు అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరారు. ఈ కేసు చాలా ముఖ్యమైనదని, నిందితులను విచారించి మరిన్ని వాస్తవాలను వెలికితీయాల్సి ఉందని, కాబట్టి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులకు పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

మాకు సంబంధం లేదు- కిషన్ రెడ్డి

అటు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై తన ప్రమేయం లేదని బీజేపీ తప్పించుకుంటోంది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధంలేదని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదన్నారు. 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనేంత డబ్బు కూడా బీజేపీ వద్దలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ను గద్దె దించి తీరుతామని చెప్పారు. ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించామని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నిందితుడు నందు తెలుసు కానీ.. అతడేమీ తన అనుచరుడు కాదని చెప్పారు. అసలు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటన్నారు. ఆ నలుగురితోనే ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా అని ప్రశ్నించారు. బీజేపీ ముందు కేసీఆర్ విఠలాచార్య సినిమాలు పనిచేయవని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి.

First Published:  28 Oct 2022 1:29 PM IST
Next Story