హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కోర్టు చెప్పినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ ఆగలేదని, వాటి నిమజ్జనం కూడా ఆగలేదంటూ మరో న్యాయవాది కోర్టుకి విన్నవించారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
ప్రతి ఏడాదీ వినాయక చవితికి నిమజ్జనం ఓ పంచాయితీలా మారుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తే జలాలు కలుషితం అవడంతోపాటు, వ్యర్థాలతో పర్యావరణం దెబ్బతింటుందనేది కొంతమంది వాదన. అదే సమయంలో నిమజ్జనానికి అనుమతి కోరుతూ మండపాల నిర్వాహకులు కోర్టుమెట్లెక్కుతారు. ప్రతి ఏడాదీ జరిగే తంతు ఇది. అయితే ఈ ఏడాది మాత్రం వాద ప్రతివాదాలు ఏవీ జరక్కుండానే తెలంగాణ హైకోర్టు పాత తీర్పు ఉటంకించింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులివ్వగా, ఈ ఏడాది కూడా అవే ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని సూచించింది. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది.
పీఓపీతో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు కొట్టివేయాలని పిటిషనర్లు కోర్టుని కోరారు. అయితే పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తివేయాలన్న అభ్యర్థనపై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది కోర్టు. అంటే ఆలోగా వినాయక చవితి పూర్తవుతుంది. ఆ తర్వాత విచారణ జరిగినా ఉత్పత్తి దారులకు ఉపయోగం ఉండదు. ఇక కోర్టు చెప్పినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ ఆగలేదని, వాటి నిమజ్జనం కూడా ఆగలేదంటూ మరో న్యాయవాది కోర్టుకి విన్నవించారు. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.