Telugu Global
Telangana

హంటర్‌ బీర్ల చిచ్చు.. అధికారులకు జూపల్లి క్లాసు

విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషన ర్ & ఎండీ శ్రీధర్, బేవరేజ్‌ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను ఆదేశించారు.

హంటర్‌ బీర్ల చిచ్చు.. అధికారులకు జూపల్లి క్లాసు
X

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఇటీవల జరిగిన పరిణామాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బెవరేజ్‌ కార్పొరేషన్‌ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. మీ సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని అన్నారు. ఎక్సైజ్‌శాఖ పనితీరుపై జూపల్లి కృష్ణారావు సుదీర్ఘ సమీక్ష చేశారు. కీలక అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశించారు.

మద్యం కంపెనీల అనుమతుల వ్యవహరంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా బేవరేజ్ కార్పొరేషన్ అధికారులు విధివిధానాలు ఎలా ఖరారు చేస్తారని మండిపడ్డారు జూపల్లి. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషన ర్ & ఎండీ శ్రీధర్, బేవరేజ్‌ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహంను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు జూపల్లి కృష్ణారావు.

తెలంగాణలో దాదాపు నెలన్నర నుంచి KF బీర్ల కొరత ఏర్పడింది. కృత్రిమంగా KF బీర్ల కొరత సృష్టించి తమకు అనుకూలమైన సోమ్‌ డిస్టిలరీస్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో దీనిపై వివరణ ఇచ్చే క్రమంలో అడ్డంగా బుక్కయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ పర్మిషన్ ఇచ్చింది బేవరేజ్ కార్పొరేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఎక్సైజ్‌ మంత్రికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా కొత్త కంపెనీలకు ఎలా అనుమతి ఇస్తారంటూ వివాదం మరింత ముదిరింది. దీంతో ప్రభుత్వం కొత్త బ్రాండ్లపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సొంత నిర్ణయాలు వద్దంటూ తాజాగా బేవరేజ్‌ కార్పొరేషన్ అధికారులకు క్లాసు పీకారు మంత్రి జూపల్లి.

First Published:  19 Jun 2024 7:55 AM IST
Next Story