Telugu Global
Telangana

తెలంగాణలో మరిన్ని బదిలీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడికో..?

వేటుపడిన వారి స్థానంలో నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు సీఎస్ శాంతి కుమారి. జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ కు సమర్పించారు. ఆయన దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.

తెలంగాణలో మరిన్ని బదిలీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడికో..?
X

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తెలంగాణ లో 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు వేయాలని ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. బదిలీ చేయాలనే లేఖలతోపాటు.. ఖాళీ అయిన పోస్టుల్లో తిరిగి నియామకాలు చేపట్టేందుకు జాబితా కూడా కోరింది. ఆ జాబితా సిద్ధం చేసిన సీఎస్ శాంతి కుమారి.. వేటుపడిన వారి స్థానంలో నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు. జాబితాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ కు సమర్పించారు. ఆయన దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ ప్యానెల్‌ లోని పేర్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందితే ఈరోజు నియామకాలు ఫైనల్ అవుతాయి, లేకపోతే మరో జాబితా కోరే అవకాశముంది. అయితే బదిలీలు ఈ 20మందితో ఆగిపోవు.. తెలంగాణలో మరిన్ని బదిలీలు ఖాయమంటున్నారు అధికారులు.

మరిన్ని బదిలీలు ఎలా..?

20మంది స్థానంలో కొత్తవారిని నియమించాలంటే, వారికి అదనపు బాధ్యతలు ఇచ్చి సరిపెట్టరు. స్థానచలనం తప్పదు. అంటే ఆ 20మంది స్థానంలో కొత్తగా మరో 20మంది రావాల్సి ఉంటుంది. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితోనే. బదిలీ అయినవారంతా ఐఏఎస్, ఐపీఎస్ కావడంతో.. కీలక స్థానాల్లో ఉన్నవారితోనే ఆయా స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. తొలి విడత వేటుపడిన 20మందికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా పక్కనపెట్టారు కాబట్టి.. మిగతా అధికారులంతా ఓ సైకిల్ ప్రకారం అటు ఇటు మారిపోతారు. అంటే బదిలీలు 20తో ఆగవు, కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి పడే వరకు అధికారులకు స్థాన చలనం తప్పదు.

బదిలీలపై బీఆర్ఎస్ స్పందన..

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తనపై వెంటనే బదిలీ వేటు వేయడం సరికాదంటూ.. మహిళా ఐఏఎస్‌ శ్రీదేవి ట్విట్టర్లో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఈ బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారుల్ని బదిలీ చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానాన్ని మార్చలేరని అన్నారు సీనియర్ నేత దాసోజు శ్రవణ్. తెలంగాణలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. మొత్తమ్మీద బదిలీల వ్యవహారం తెలంగాణ ఎన్నికల వేళ కీలక పరిణామంగా చెప్పొచ్చు.

First Published:  13 Oct 2023 8:25 AM IST
Next Story