Telugu Global
Telangana

ఎన్నికల వేళ లిక్కర్‌ కిక్కు.. పెరిగిన సేల్స్.!

ఈ ఏడాది బీర్ల అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో బీర్ సేవించేవారే ఎక్కువ ఉన్నారని అధికారులు తెలిపారు.

ఎన్నికల వేళ లిక్కర్‌ కిక్కు.. పెరిగిన సేల్స్.!
X

అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. నవంబర్‌ 1-19 మధ్య రాష్ట్రంలో దాదాపు రూ.1,400 కోట్ల విలువైన 36.01 లక్షల కార్టన్‌ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో రూ.1,200 కోట్ల విలువైన 29.97 లక్షల కార్టన్‌లు అమ్ముడయ్యాయి.

తెలంగాణ స్టేట్ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌ నుంచి 19 వరకు 21.89 లక్షల కార్టన్‌ల బీర్లు, 14.12 లక్షల కార్టన్‌ల ఇతర మద్యం అమ్ముడైంది. గతేడాది ఇదే టైమ్‌లో 11.87 లక్షల కార్టన్‌ల బీర్లు, 18.1 లక్షల కార్టన్ల ఇతర మద్యం అమ్ముడైంది.

ఈ ఏడాది బీర్ల అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో బీర్ సేవించేవారే ఎక్కువ ఉన్నారని అధికారులు తెలిపారు. GHMC మినహాయిస్తే ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు అధికారులు. డిసెంబర్‌ 12 వరకు కార్తీకమాసం కొనసాగుతుండటంతో చాలా మంది అభ్యర్థులు పెద్ద మొత్తంలో మద్యం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారన్నారు. ఇక వైన్‌ షాపుల ప్రస్తుత గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో.. చాలా మంది లైసెన్స్‌దారులు ఆర్డర్‌లను తగ్గిస్తుండటంతో అమ్మకాలు ఇంతకుమించి పెరిగే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.

First Published:  21 Nov 2023 8:14 AM IST
Next Story