Telugu Global
Telangana

బ్యూటీ పార్లర్ పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్

ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు 35 వేలు జీతం ఇస్తామని చెప్పి రెండు మూడు నెలల పాటు జీతం కరెక్ట్ టైంకే ఇచ్చారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

బ్యూటీ పార్లర్ పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్
X

బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ ఇస్తామంటూ ఓ కిలాడీ కపుల్ చేసిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మొత్తం 100 సెంటర్లు ప్రారంభించి అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెస్సికా.. మూడు కోట్లతో జెండా ఎత్తేశారు. గతంలోనూ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు వీరి మోసానికి బలయ్యారని సమాచారం.

ఈ ముగ్గురు తమకు హైదరాబాద్ లోని ప్రగతి నగర్‌లో హెడ్ ఆఫీస్ ఉందని చెబుతూ గత కొన్ని రోజులుగా రోజ్ గోల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానళ్లలో సెలబ్రిటీలతో యాడ్స్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రకటనలు చేయటమే కాకుండా.. ప్రాంఛైజీ పెట్టుకుంటే డబ్బులే డబ్బులంటూ ఊదరగొట్టారు. ఈ యాడ్స్ చూసిన కొందరు.. డబ్బు సంపాదించొచ్చనే ఆశతో వారిని కాంటాక్ట్ అయ్యారు. తమ వలలో చిక్కుకున్న బాధితుల నుంచి.. లక్షల్లో పెట్టుబడులు పెట్టించి సెంటర్లు ఓపెన్ చేయించారు. ఒక్కో బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలను బాధితుల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఇలా ఏకంగా 100కి పైగానే పార్లర్లు ఓపెన్ చేయించారు.

ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకు 35 వేలు జీతం ఇస్తామని చెప్పి రెండు మూడు నెలల పాటు జీతం కరెక్ట్ టైంకే ఇచ్చారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. జీతం ఇవ్వటం ఆపేశారు. ఏమైందని అడిగితే.. రేపు, మాపు అంటూ కాలం గడిపారు. చివరకు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయటంతో.. అనుమానం వచ్చిన బాధితులు హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీస్‌కు వచ్చి చూసి షాక్ అయ్యారు. ఆరు నెలల నుంచి ప్రగతినగర్ బ్రాంచ్ మూసివేసి ఉందని అక్క‌డి స్థానికులు చెప్పటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మోసపోయామని గ్రహించి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  29 Jan 2024 6:46 PM IST
Next Story