కేటీఆర్ కి గ్రాండ్ వెల్కమ్.. ఓఆర్ఆర్ పై భారీ ఫ్లెక్సీలు
ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలతో దాదాపు 42,000 ఉద్యోగాలు లభించే అవకాశముంది. దశాబ్ది ఉత్సవాల సంతోషంలో ఉన్న తెలంగాణ వాసులకు ఈ ఉద్యోగాలు మరింత భరోసా ఇస్తాయనడంలో సందేహం లేదు.
విదేశీ పర్యటన ముగించుకుని నగరానికి తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అందులోనూ ఇది మామూలు పర్యటన కాదు, ఇప్పటికే బ్రిటన్ పర్యటన దిగ్విజయంగా సాగింది, ఆ తర్వాత ఇప్పుడు అమెరికా పర్యటన కూడా ఘనంగా ముగిసింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 42వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు విదేశీ సంస్థలతో పలు ఒప్పందాలు జరిగాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి. ఐటీ, పరిశ్రమలు, వైద్యం, ఫార్మా రంగాల్లో ఈ పెట్టుబడులు తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించబోతున్నాయి.
అంతా కేటీఆర్ చలవే..
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ చొరవతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి. 2023 సంవత్సరంలో దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పించిన నగరంగా హైదరాబాద్ రికార్డ్ సృష్టించింది. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 23,032 పరిశ్రమలు ఏర్పాటు కాగా, రూ. 2,62,049 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. 17,61,778 ఉద్యోగాలు తెలంగాణకు వచ్చాయి. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ బ్రిటన్, అమెరికాల్లో జరిపిన పర్యటనల సందర్భంగా పలు గ్లోబల్ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, విస్తరణ ప్రణాళికలతో ముందుకు వచ్చాయి. దాదాపు రూ.5800 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించగా, మరికొన్ని సంస్థలు పెట్టుబడి వివరాలను వెల్లడించాల్సిఉంది.
వివిధ రంగాల గ్లోబల్ లీడింగ్ సంస్థల ప్రతినిధులతో 80కి పైగా బిజినెస్ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. 5 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. అనేక మంది తమ కంపెనీల తరపున కేటీఆర్ తో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. వీరిలో ప్రవాస తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను కేటీఆర్ వారికి వివరించారు. ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు వెంటనే లభిస్తాయని భరోసా కల్పించారు. ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలతో దాదాపు 42,000 ఉద్యోగాలు లభించే అవకాశముంది. దశాబ్ది ఉత్సవాల సంతోషంలో ఉన్న తెలంగాణ వాసులకు ఈ ఉద్యోగాలు మరింత భరోసా ఇస్తాయనడంలో సందేహం లేదు. అందుకే మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి.