Telugu Global
Telangana

తెలంగాణలో కోకాకోలా భారీ విస్తరణ.. రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు

కొత్త ప్రతిపాదిత ప్లాంట్‌లో పెట్టుబడులు కూడా కలిపితే తెలంగాణలోనే రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు తక్కువ కాలంలోనే పెట్టినట్లు అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణలో కోకాకోలా భారీ విస్తరణ.. రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు
X

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ బేవరేజెస్ సంస్థ కోకాకోలా నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ప్లాంట్లకు తోడుగా.. భారీగా విస్తరణ చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తమ అదనపు పెట్టుబడుల ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తాజాగా కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మెక్ గ్రివితో సమావేశం అయ్యారు. కోకాకోలాకు ఇండియా మూడో అతి పెద్ద మార్కెట్ అని మెక్ గ్రివి చెప్పారు. ఈ క్రమంలో తమ కార్యకలాపాలు భారీగా విస్తరించే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులను రెట్టింపు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌కు జేమ్స్ మెక్ గ్రివి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ వద్ద ఉన్న భారీ బాట్లింగ్ ప్లాంట్ విస్తరణకు గతంలోనే రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో రూ.1,000 కోట్లతో కొత్త బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి వ్యయం చేస్తున్నట్లు మంత్రికి వెల్లడించారు. ఏప్రిల్‌లోనే దీనికి సంబంధించిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్లు చెప్పారు.

వ్యాపార వృద్ధిని దృష్టిలో పెట్టుకొని అక్కడ అదనంగా రూ.647 కోట్ల పెట్టుబడులు పెట్టునున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న ప్లాంట్‌లోనే ఈ అదనపు పెట్టుబడులు పెడతామని మంత్రి కేటీఆర్‌కు మెక్‌ గ్రివి వివరించారు. సిద్దిపేట జిల్లాలోని ప్లాంట్ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 24 నాటికి పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. కాగా, సిద్దిపేట ప్లాంట్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే తెలంగాణలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కోకాకోలా వెల్లడించింది.

కరీంనగర్ లేదా వరంగల్ ప్రాంతంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త ప్రతిపాదిత ప్లాంట్‌లో పెట్టుబడులు కూడా కలిపితే తెలంగాణలోనే రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు తక్కువ కాలంలోనే పెట్టినట్లు అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయడానికి నిర్ణయించుకున్నందుకు కోకాకోలా కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ప్రతిపాదిస్తున్న రెండో తయారీ కేంద్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని చెప్పడానికి కోకాకోలా ప్రకటించిన పెట్టుబడులే సాక్ష్యాలని కేటీఆర్ అన్నారు.


First Published:  26 Aug 2023 10:52 AM IST
Next Story