Telugu Global
Telangana

మల్కాజ్‌గిరి ఎంపీ సీటు ఎవరిది.. బీజేపీలో తీవ్ర పోటీ..?

మల్కాజ్‌గిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ ఉత్తరాది ప్రభావం ఎక్కువ. కచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం ఉంది.

మల్కాజ్‌గిరి ఎంపీ సీటు ఎవరిది.. బీజేపీలో తీవ్ర పోటీ..?
X

లోక్‌సభ సీట్ల విష‌యంలో బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యమైన స్థానాల కోసం నేతలు ఇప్పటికే ఖర్చీఫ్ వేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన‌ ఈటల రాజేందర్ తాజాగా ఎంపీ సీటుపై గురిపెట్టారు. మొదట మెదక్ నుంచి పోటీ చేయాలని భావించినా.. అక్కడ రఘునందన్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఆయన ప్రస్తుతం మల్కాజ్‌గిరి స్థానంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సీటు కోసం బీజేపీలో మురళీధర్ రావు, మరో నేత రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. సీనియర్ నేతలంతా ఓడినప్పటికీ.. ఆ పార్టీ తరఫున 8 మంది అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓటు శాతం కూడా భారీగా పెంచుకుంది. ఇక ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కమలనాథులు జెండా ఎగరేశారు. కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని బలంగా నమ్ముతున్నారు. మోడీ సైతం ఇటీవల పలు సభల్లో మరోసారి తానే ప్రధాని అని ప్రకటించారు. బీజేపీ సైతం సౌత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కర్ణాటక, తెలంగాణల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

మల్కాజ్‌గిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ ఉత్తరాది ప్రభావం ఎక్కువ. కచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎన్.రామచంద్రరావు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి తనకు ఛాన్స్ ఉంటుందేమోనని ఈటల భావిస్తున్నారు. అయితే ఇదే సీటు మీద జాతీయ నేత మురళీధర్ రావు ఫోకస్ చేయడం ఆసక్తిగా మారింది.

First Published:  19 Dec 2023 9:13 AM GMT
Next Story