6 కార్లలో తరలిస్తున్న రూ.7.40 కోట్ల నగదు పట్టివేత
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల ద్వారా రూ. 570 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారీగా నగదు పట్టుబడుతోంది. తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి 6 కార్లలో తరలిస్తున్న రూ.7.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నగదు తరలింపునకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్ చేశారు. కార్లను కూడా సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అందిన సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ అప్పా కూడలి వద్ద సోదాలు నిర్వహించగా ఈ నగదు పట్టుబడింది. ఈ నగదు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలంగాణలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా.. అప్పటి నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కేంద్ర బలగాల సహకారం తీసుకొని పలుచోట్ల చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి సోదాలు జరుపుతున్నారు. పోలీసులు ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌పై దృష్టిపెట్టారు. అధికార, ప్రతిపక్ష నేతలకు చెందిన వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల ద్వారా రూ. 570 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఆ లోపు మరింత నగదు పట్టుబడే అవకాశం ఉంది.
♦