మా కార్యకర్తలను చంపిన గద్దర్‌కు ఎట్లా పద్మశ్రీ ఇస్తాం
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
వందలాది మంది బీజేపీ కార్యకర్తలను చంపిన, చంపినోళ్లను పొగుడుతూ పాటలు పాడిన గద్దర్‌కు ఎట్లా పద్మశ్రీ అవార్డు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై సోమవారం ఆయన స్పందించారు. గద్దర్ భావజాలం ఏమిటి ఆయనకు అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించిన తమ కార్యకర్తలను చంపినోళ్లను ఆయన పొగుడుతూ పాటలు పాడారని అన్నారు. పోలీసులను చంపిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా అని ప్రశ్నించారు. అవార్డులు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వొద్దో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. కేంద్రం నిధులతో ఇండ్లు కడుతూ, బియ్యం ఇస్తూ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటే ఎట్లానని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పేరు కాకపోతే ఒసామా బిన్ లాడెన్ పేరుకోమనండి అని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలను గద్దర్ అభిమానులు తీవ్రంగా ఖండించారు. గతంలో బీజేపీ ఆఫీస్‌కు పోయినప్పుడు ఆయనను ఆలింగనం చేసుకున్న రోజు వాళ్ల పార్టీ కార్యకర్తలను చంపిన విషయం సంజయ్‌కు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. గద్దర్ చనిపోతే ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారని తెలిపారు. అప్పుడు గుర్తుకురాని అంశాలు ఆయనకు అవార్డు ఇవ్వాలన్నప్పుడు ఎందుకు అడ్డంకిగా మారాయని మండిపడుతున్నారు.