ధరలు పెంచకుండా ఆదాయం ఎలా పెంచుకోవాలి
మార్గాలను అన్వేషించండి.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
ధరలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే మార్గాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేలా ఎన్ ఫోర్స్‌మెంట్ వింగ్ బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, అందుకోసం ఉమ్మడిగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, పన్నుల ఎగవేతను కట్టడి చేయడానికి కమర్షియల్ ట్యాక్స్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులు సమావేశమై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధీనంలోని ఇండ్లను అమ్మడానికి ప్రయత్నించాలని, రాజీవ్ స్వగృహకు సంబంధించిన వాటిలో ఇంకా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఇసుక రీచ్ లతో అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలపై నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు వికాస్ రాజ్, రిజ్వి, దానా కిషోర్, మైనింగ్ సెక్రటరీ సురేంద్రమోహన్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.