Telugu Global
Telangana

ఉత్తమ్ కుమార్ టీడీపీ నుండి తిన్న డబ్బులెన్ని ? బైటపెట్టాలి - కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డిమాండ్

సీనియర్లకు, ఇటు రేవంత్ వర్గానికి మధ్య మాటల యుద్దం కూడా పెరుగుతోంది. ఈ రోజు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనీల్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికే ఉత్తమ్ సహా మరి కొందరు నాయకులు పని చేస్తున్నారని ఆరోపించారు.

ఉత్తమ్ కుమార్ టీడీపీ నుండి తిన్న డబ్బులెన్ని ? బైటపెట్టాలి - కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డిమాండ్
X

కాంగ్రెస్ లో రచ్చ రగులుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ల కు వ్యతిరేకంగా నిన్న ఆ పార్టీలోని సీనియర్లు సమావేశమయ్యి రేవంత్ పై నిప్పులు చెరిగారు. రేవంత్ పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ సేవ్ కాంగ్రెస్ నినాదం ఇచ్చారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మధుయాష్కీ, దామోదరం రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని, అప్పటి వరకు రేవంత్ రెడ్డి చేపట్టే ఏ కార్యక్రమాలకూ హాజరుకావద్దని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో అటు సీనియర్లకు, ఇటు రేవంత్ వర్గానికి మధ్య మాటల యుద్దం కూడా పెరుగుతోంది. ఈ రోజు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనీల్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడానికే ఉత్తమ్ సహా మరి కొందరు నాయకులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఈయన పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టి వెళ్తే ఉత్తమ్ కు సేవ్ కాంగ్రెస్ నినాదం గుర్తుకు రాలేదా అని అనీల్ ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో ఉత్తమ్ తన నియోజ క వర్గంలో గెలవడం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకొన్న విషయం నిజం కాదా ? ''ఆ ఎన్నికల సందర్భంగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన డబ్బులు ఎంత ? ఆ డబ్బులను ఏం చేశావు. నీ బంధువు కౌశిక్ రెడ్డికి కోట్ల రూపాయలు ఇవ్వలేదా ? మేమడిగితే ఒక్కపైసా కూడా ఎందుకు ఇవ్వలేదు ? అప్పుడొచ్చిన డబ్బుల లెక్కలు అడుగుతారనే భయంతోనే ట్రెజరర్ నారాయణ రెడ్డిని బీజేపీలోకి పంపించింది నువ్వు కాదా'' అని అనీల్ మండి పడ్డారు.

కాంగ్రెస్ పత‌నానికి అసలు కారణమైన ఉత్తమ్ కుమార్ బీసీలను, ఎస్సీలను అణగదొక్కాడు. సీఎల్పీ నాయకుడుగా భట్టిని అధిష్టానం నియమిస్తే ఆ కక్షతో తన వర్గం ఎమ్మెల్యేలను టీఆరెస్ లోకి పంపింది ఉత్తమ్ కుమారే అని అనిల్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి టీఆరెస్ లోకి వెళ్ళడానికి కారణం కూడా ఉత్తమ్ కుమారే అని అనిల్ మండిపడ్డారు. మునుగోడులో పరోక్షంగా కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రయత్నించారని అనీల్ ఆరోపించారు.

ఇప్పటి వరకు తెరవెనక రాజకీయాలు చేస్తున్న ఉత్తమ్ కుమార్ ఇప్పుడు ముసుగు తీసి బైటికి వచ్చాడని అనిల్ అన్నారు. మిగతావాళ్ళంతా అమాయకులే అని, ఉత్తమే మొత్తం రాజకీయాలు నడిపిస్తున్నాడని మండిపడ్డారు అనీల్.

పీసీసీ కమిటీల్లో టీడీపి నుండి వచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చారని ఆరోపణలు చేయడం ఓ కుట్ర అని అనీల్ ఆరోపించారు. 180 మంది కార్యవర్గ సభ్యుల్లో 12 మంది మాత్రమే టీడీపీ నుండి వచ్చిన వాళ్ళని వాళ్ళు కూడా చాలా కాలంగా కాంగ్రెస్ లో పని చేస్తున్నారని, వారు చాలా ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళని చెప్పిన అనీల్, రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టడానికే ఉత్తమ్ కుమార్ ఈ విధమైన రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పాద యాత్ర మొదలుపెడుతున్నారు కాబట్టే దాన్ని ఆపడానికి ఉత్తమ్ బ్యాచ్ కుట్రలు పన్నుతున్నారని అనీల్ ధ్వజమెత్తారు. పార్టీ కొద్దిగా పుంజుకుంటుందనే పరిస్థితి రాగానే కొందరు సీనియర్ల పేరిట ముందుకు వచ్చి ఆ పరిస్థితిని నాశనం చేస్తారని అనీల్ ఆరోపించారు. వీరికి వేరే పార్టీలతో ఒప్పందాలున్నాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని అనీల్ అన్నారు.


First Published:  18 Dec 2022 1:56 PM IST
Next Story