Telugu Global
Telangana

మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? ఎందుకు రూ.1.50 లక్షల కోట్లు?

కాళేశ్వరంపై గగ్గోలు పెట్టినోళ్లు.. మూసీ వ్యయం ఎందుకు పెంచుతున్నరు : కేటీఆర్‌

మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? ఎందుకు రూ.1.50 లక్షల కోట్లు?
X

మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు.. దానికి ఎందుకు రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. శనివారం 'ఎక్స్‌' వేదికగా మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు, మూసీ సుందరీకరణకే రూ.1.50 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు. 1.50 లక్షల కోట్లు అంటే 15 పక్కన ఎన్ని సున్నాలో అని ఆ అంకెను కోట్‌ చేశారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న రూ.50 వేల కోట్లు, నిన్న రూ.70 వేల కోట్లు ఖర్చయితదని చెప్పినోళ్లు ఇప్పుడు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్నారని తెలిపారు. మూసీ ప్రాజెక్టులో నిల్వ ఉంచే టీఎంసీలెన్ని, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని.. పెరిగే పంటల దిగుబడి ఎంత.. తీర్చే పారిశ్రామిక అవసరాలెన్ని.. కొత్తగా నిర్మించబోయే రిజర్వాయర్లెన్ని.. ఈ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి పుట్టిన గడ్డపై మమకారం లేదని, అందుకే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టన్నా మూసీపైనే మక్కువ చూపుతున్నారని మండిపడ్డారు. చివరి దశలో ఉన్న'పాలమూరు'ను పక్కన పెట్టిన, కోల్డ్‌ స్టోరేజీలోకి నెట్టేసి.. మూసీ చుట్టే ఎందుకీ మంత్రాంగం ప్రశ్నించారు. లండన్‌ లోని థేమ్స్‌ లాగా మారుస్తామనే వ్యూహం వెనుకున్న థీమ్‌ ఏంటి.. గేమ్‌ ప్లాన్‌ ఏంటి అని నిలదీశారు. మూసీ అంచనా వ్యయం మూడింతలు పెంచడం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని అన్నారు. తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే సహించబోమని తేల్చిచెప్పారు. "మూసీ రివర్ ఫ్రంట్" పేరుతో బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందని.. కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుందని హెచ్చరించారు.

First Published:  28 Sept 2024 2:18 PM GMT
Next Story