Telugu Global
Telangana

ఇళ్లు, పొలాలు, ప్రాజెక్ట్‌లు.. అన్నీ నీటిలోనే..

గోదావరికి ఎన్నడూ లేనంత వరద ప్రవాహం వచ్చింది. మహారాష్ట్ర‌, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ.. మూడు రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ ముంపు బారినపడ్డాయి.

ఇళ్లు, పొలాలు, ప్రాజెక్ట్‌లు.. అన్నీ నీటిలోనే..
X

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పోటెత్తింది. ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలు, సాగునీటి ప్రాజెక్ట్ లు అన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 1986లో మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాంతంలో రికార్డు అయిన భారీ వరదను మించి ఇప్పుడు గోదావరి ప్రవహిస్తోంది. అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర‌, ఛత్తీస్ ఘడ్ నుంచి వస్తున్న వరద నీటితో.. ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయిపోయింది. మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులు దాటింది. బ్యారేజ్ గరిష్ట ఎత్తు 108 మీటర్లు కాగా.. అక్కడ ప్రస్తుతం 102 మీటర్ల మేర నీరు చేరుకుంది. దీంతో స్పిల్ వే పిల్లర్లు సైతం మునిగిపోయాయి. ప్రాణహిత, పెన్ గంగ, వార్ధ లాంటి ఉపనదుల నుంచి భారీగా వరద రావడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

సాధారణంగా ప్రాణహిత నుంచి మాత్రమే గోదావరికి వరద వస్తుంది. వార్ధ, పెన్ గంగ కు ఎప్పుడోకాని వరద రాదు. కానీ ఈసారి అన్ని ఉపనదులూ ఒకేసారి పోటెత్తాయి, దీంతో గోదావరికి ఎన్నడూ లేనంత వరద ప్రవాహం వచ్చింది. మహారాష్ట్ర‌, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ.. మూడు రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ ముంపు బారినపడ్డాయి. కాళేశ్వరం దేవాలయంలోకి నీరు ప్రవేశించింది. ప్రాజెక్ట్ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్ సహా, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నీటిలో మునిగిపోయాయి. మిడ్ మానేరు, శ్రీరాం సాగర్, కడెం నారాయణరెడ్డి, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి తదితర ప్రాజెక్ట్ ల నుంచి వరద నీరు కిందకు విడుదల చేస్తూనే ఉన్నారు.

గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్టుగా వణికిపోతున్నాయి. ఎల్లంపల్లి నుంచి 11.79 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంటే, 11.58 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాం సాగర్ 3.29 లక్షల క్యూస్కెల నీటిని విడుదల చేస్తున్నారు. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం వార్ధ ఉప నదికి గతంలో ఎప్పుడూ వరదలు రాలేదు. కానీ ఈసారి వార్ధ 162 మీటర్ల గరిష్ట ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తోంది. దీనివల్ల మహారాష్ట్ర‌లోని చంద్రాపూర్ జిల్లా నీట మునిగింది.

ఏయే ప్రాంతాల్లో గోదావరి వరద పరిస్థితి ఎలా ఉందంటే..?

భైంసా: నిలకడగా ఉంది..

సింగూరు రిజర్వాయర్ : వరద పెరుగుతోంది..

నిజాం సాగర్ డ్యాం : పెరుగుతోంది..

శ్రీరామ్ సాగర్ : పెరుగుతోంది..

కడెం ప్రాజెక్ట్ : నిలకడగా ఉంది..

శ్రీ పాద ఎల్లంపల్లి : పెరుగుతోంది..

మంచిర్యాల : ప్రమాదకర స్థాయి నుండి కాస్త తగ్గుతోంది..

కాళేశ్వరం : ప్రమాదకర స్థాయి నుండి పెరుగుతోంది..

లక్ష్మీ బ్యారేజ్ : ప్రమాదకర స్థాయి నుండి పెరుగుతోంది

పేరూరు : ప్రమాదకర స్థాయి నుండి పెరుగుతోంది..

కంతనపల్లి : గరిష్ట స్థాయికి చేరుకుంటోంది..

ఏటూరునాగారం : ప్రమాదకర స్థాయి నుండి పెరుగుతోంది..

దుమ్ముగూడెం : పెరుగుతోంది..

భద్రాచలం : పెరుగుతోంది..

First Published:  14 July 2022 5:10 PM IST
Next Story