ఫెవిక్విక్ ఉండగా కుట్లు ఎందుకు దండగ.. ఓ ఆస్పత్రి నిర్వాకం
తెగిన చోట రక్తం ఆగిపోయింది, కుట్లు వేశారా అని ప్రవీణ్ తండ్రి సిబ్బందిని అడిగాడు, వారు వేయలేదని చెప్పారు. మరి రక్తం రాకుండా ఎలా ఆగింది అంటే.. ఫెవిక్విక్ తో అంటించారని పిల్లవాడు సమాధానమిచ్చాడు.
దెబ్బ తగిలిందని పిల్లవాడిని ఆస్పత్రికి తీసుకెళ్తే, గాయం ఉన్నచోట కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అంటించి సరిపెట్టారు. ఇదేదో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం అనుకుంటే పొరపాటే, ప్రైవేటు ఆస్పత్రిలో ఈ దారుణ నిర్లక్ష్యం జరిగింది. దీంతో వెంటనే బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ వాడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో జరిగింది. కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. ఏడేళ్ల కొడుకు ప్రవీణ్ చౌదరితో కలసి ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు అయిజలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చారు. పెళ్లి వేడుకల్లో ఆడుకుంటూ ప్రవీణ్ కిందపడ్డాడు. ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. దీంతో వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. లోతుగా తెగిన చోట వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అతికించారు.
తెగిన చోట రక్తం ఆగిపోయింది, కుట్లు వేశారా అని ప్రవీణ్ తండ్రి సిబ్బందిని అడిగాడు, వారు వేయలేదని చెప్పారు. మరి రక్తం రాకుండా ఎలా ఆగింది అంటే.. ఫెవిక్విక్ తో అంటించారని పిల్లవాడు సమాధానమిచ్చాడు. దీంతో తండ్రి ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాక్టర్ ని నిలదీశాడు. సిబ్బంది పొరపాటు చేసి ఉంటారని డాక్టర్ బతిమిలాడుకున్నాడు. అబ్బాయికి ఏమీ కాదని సర్దిచెప్పి పంపించాడు. కానీ ఈ నిర్లక్ష్యాన్ని అక్కడితో వదిలిపెట్టాలనుకోలేదు ప్రవీణ్ తండ్రి. నేరుగా అయిజ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు.