Telugu Global
Telangana

ఇంటి నుంచే ఓటు.. ఇవాల్టి నుంచే ప్రారంభం

తెలంగాణలో మొత్తం 28,057 మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా, గోప్యంగా జరగనుంది.

ఇంటి నుంచే ఓటు.. ఇవాల్టి నుంచే ప్రారంభం
X

నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ పోలింగ్ జరగనుండగా.. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది. 119 నియోజకవర్గాల్లో నవంబర్ 27 వరకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు. తెలంగాణలో ఈ సదుపాయం కల్పించడం ఇదే మొదటిసారి. దేశంలోనే ఫస్ట్ టైమ్‌ ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పద్ధతిని సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించారు ఎన్నికల అధికారులు.

తెలంగాణలో మొత్తం 28,057 మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల కమిషన్. నిబంధనల ప్రకారం ఈ ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా, గోప్యంగా జరగనుంది. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీస్తారు. తర్వాత వీటిని RO ఆఫీసులో భద్రపరుస్తారు. కౌంటింగ్‌ రోజున మిగిలిన ఓట్లతో కలిపి లెక్కిస్తారు. ఇంటి నుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు ఓ తేదీని కేటాయిస్తారు. ఆ రోజున రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ఇద్దరు పోలింగ్ సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు సేకరిస్తారు. ఈ సదుపాయం ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్ లాంటిదే.

నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇవాళ, రేపు ఇంటి నుంచే ఓటు వేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు. అచ్చంపేట నియోజకవర్గంలో నవంబర్‌ 23, 25న ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక మహబూబాబాద్‌లో 23, 24 తేదీల్లో అవకాశం కల్పించారు. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 23, 24, 25 తేదీల్లో ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించనున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో ఈనెల 21 నుంచి 25 మధ్య హోం ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

First Published:  21 Nov 2023 10:39 AM IST
Next Story