Telugu Global
Telangana

అమిత్ షా నోట ముందస్తు మాట.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదా? అధికార బీఆర్ఎస్ పార్టీ మూడ్ ఎలా ఉన్నదని అమిత్ షా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.

అమిత్ షా నోట ముందస్తు మాట.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి!
X

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే పదే చెబుతున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతారని వార్తలు రావడమే కానీ, అటు నుంచి మాత్రం స్పందన లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ మాత్రం తాజాగా దీనిపై దృష్టి పెట్టింది.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలోని ట్రైనీ ఐపీఎస్‌ల ఔటింగ్ పరేడ్‌కు హోం మంత్రి అమిత్ షా వచ్చారు. అంతకు ముందు ఆయన నోవాటెల్ హోటల్‌లో బీజేపీ తెలంగాణ నేతలతో సమావేశం అయ్యారు. స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్, మంత్రి కిషన్ రెడ్డి, సునిల్ బన్సల్, ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదా? అధికార బీఆర్ఎస్ పార్టీ మూడ్ ఎలా ఉన్నదని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో ముందస్తు వస్తే బీజేపీ పరిస్థితి ఏంటి? పార్టీ ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నదా? గతంలో కంటే పార్టీ పుంజుకున్నదా అని ప్రశ్నించినట్లు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందకు సిద్ధంగా ఉండాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని చెప్పారు.బీజేపీ ఇప్పటికే 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 25 లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ముందస్తు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని.. కాబట్టి బీజేపీ నేతలంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

కాగా, బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ముందస్తు మాట ఎత్తడం లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రస్తుతం వీటిపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్.. ముందస్తు వైపు మొగ్గు చూపే అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే, కేసీఆర్ ఆలోచనలను అంచనా వేయడం కష్టమని.. ఆయన ఏ క్షణమైనా హఠాత్తుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండటమే మంచిదని కూడా అనుకుంటున్నాయి.

ఇప్పటికే బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార బీఆర్ఎస్ కూడా బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను సంసిద్ధం చేస్తోంది. ముందస్తు రాకపోయినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు మరో 10 నెలల్లో జరుగనున్నందునే బీఆర్ఎస్ దూకుడుగా వెళ్తోంది.

First Published:  11 Feb 2023 10:58 AM IST
Next Story