Telugu Global
Telangana

తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌లో భద్రాచలం టూర్

బీజేపీ మోడీ హయాంలోని విజయాలను చెప్పుకుంటూ పలు చోట్లు బహిరంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోం మంత్రి అమిత్ షా పలు సభల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌లో భద్రాచలం టూర్
X

బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, ఆత్మీయ, నివేదన సభలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకొని రావడమే కాకుండా.. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తోంది.

బీజేపీ కూడా మోడీ హయాంలోని విజయాలను చెప్పుకుంటూ పలు చోట్లు బహిరంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోం మంత్రి అమిత్ షా పలు సభల్లో పాల్గొన్నారు. తాజాగా అమిత్ షా తెలంగాణలో పర్యటన ఫిక్స్ చేశారు. ఖమ్మంలో జూన్ 15న జరుగనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సభలో పాల్గొంటారు. ఇక్కడి నుంచే తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించాలని కూడా భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ప్రకటించింది.

అమిత్ షా జూన్ 15న ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పార్టీ ముఖ్యనేతలతో కలసి అల్పాహారం తీసుకొని, ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 1.15 గంటలకు శంషాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో భద్రాచలం వెళ్తారు. భద్రాచలంలో మధ్యాహ్నం 2.30 నుంచి 3.20 మధ్య శ్రీరాముల వారిని దర్శించుకుంటారు. అక్కడే రాముల వారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భద్రాచలం నుంచి ఖమ్మానికి సాయంత్రం చేరుకుంటారు. అక్కడి ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం హెలీకాప్టర్‌లో తిరిగి శంషాబాద్ చేరుకుంటారు. కాగా, శంషాబాద్‌లో రాత్రి 8 గంటల తర్వాత పలువురు కీలక నేతలతో భేటీ ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలపై వారితో చర్చిస్తారని సమాచారం. అనంతరం అదే రోజు రాత్రి ఢిల్లీకి అమిత్ షా తిరిగి వెళ్తారు.

First Published:  12 Jun 2023 9:55 AM GMT
Next Story