Telugu Global
Telangana

విమోచన దినం జరపడానికి అన్ని పార్టీలు భయపడ్డాయి - హోం మంత్రి అమిత్ షా

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

విమోచన దినం జరపడానికి అన్ని పార్టీలు భయపడ్డాయి - హోం మంత్రి అమిత్ షా
X

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలేదని, ఇన్నాళ్లూ అన్ని పార్టీలు ఈ రోజును గుర్తు చేసుకోవడానికి కూడా భయపడ్డాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే పీఎం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ ఏడాది హైదరాబాద్‌లో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్రం సహా కర్ణాటక, మహారాష్ట్రలోకి కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వతంత్ర వచ్చిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృష్టితో ఈ ప్రాంత ప్రజలకు నిజాం పాలన‌ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత గానీ హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం లభించలేదని చెప్పారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా ముగింపు పలికారని ఆయన గుర్తు చేశారు. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని అమిత్ షా చెప్పారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని ఆయన అన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిసే.. కొందరు వివిధ పేర్లతో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి త్యాగాల వల్ల అధికారంలో ఉన్నారో.. వారికి శ్రద్ధాంజలి ఘటించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అని అమిత్ షా అన్నారు. కుమురం భీమ్, రాంజీ గోండ్, చెన్నారెడ్డి లాంటి ఎంతో మంది స్వాతంత్య్ర‌ సమరయోధులకు పటేల్ గౌరవ వందనాన్ని సమర్పించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అలాంటి యోధులందరినీ స్మరించుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఈ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే కూడా పాల్గొన్నారు.

First Published:  17 Sept 2022 12:51 PM IST
Next Story