హోంగార్డ్ రవీందర్ భార్య సంచలన ఆరోపణలు..
రవీందర్ మృతిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆయన భార్య సంధ్యతో పాటు కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెతో చర్చించారు. ఆందోళన విరమించాలని కోరారు.
జీతాలు సకాలంలో అందక ఆవేశంలో హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం ఉంది. ఈ ప్రచారం నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అయితే అసలిది ఆత్మహత్య కాదని, హత్య అని అంటున్నారు హోంగార్డ్ రవీందర్ భార్య సంధ్య. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు.
17 ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వహించిన తన భర్త రవీందర్, ఒక నెల జీతం ఆలస్యమైందని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు ఆయన భార్య సంధ్య. రవీందర్ పై ఏఎస్సై నర్సింగ రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్ ను అన్‌లాక్ చేసి డేటా డిలీట్ చేశారని కూడా ఆరోపించారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, కానిస్టేబుల్, ఏఎస్సైని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రవీందర్ మృతిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆయన భార్య సంధ్యతో పాటు కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమెతో చర్చించారు. ఆందోళన విరమించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులమాలనుకుంటున్న ప్రతిపక్షాలకు రవీందర్ భార్య వాదనతో ఆ ఛాన్స్ మిస్సైంది. రవీందర్ విషయంలో ఆ ఇద్దరే దోషులని ఆరోపిస్తున్నారు ఆయన భార్య సంధ్య.