Telugu Global
Telangana

ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్న హెచ్ఎండీఏ.. రూ.6,000 కోట్ల ఆదాయం అంచనా

హెచ్ఎండీఏ లీజుకు ఇవ్వబోయే సంస్థ కేవలం టోల్ వసూలు చేయడమే కాకుండా.. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ప్రమాదాలు జరిగిన సమయంలో క్లియరెన్స్, రిపేర్లు, రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా చేపట్టాల్సి ఉంది. ఓఆర్ఆర్ ఆస్తులను కాపాడటం, కబ్జాలు జరగకుండా చూడటం కూడా లీజు సంస్థ బాధ్యతే అని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు

ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్న హెచ్ఎండీఏ.. రూ.6,000 కోట్ల ఆదాయం అంచనా
X

హైదరాబాద్ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను 20 నుంచి 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఏదైనా ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా రూ. 4,000 కోట్ల నుంచి రూ.6,000 కోట్ల ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఔటర్‌పై ఈగల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్ అనే సంస్థ టోల్ వసూలు చేసుకుంటూ.. ప్రతీ నెల రూ.24 కోట్లను హెచ్ఎండీఏకు ఇస్తోంది. ఓఆర్ఆర్ టోల్ వసూలు ద్వారా 2019-20లో రూ.351 కోట్లు, 2020-21లో రూ.310 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఏడాది కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో రూ.421 కోట్ల ఆదాయం వచ్చింది.

కాగా, ఈగల్ ఇన్‌ఫ్రా కేవలం టోల్ మాత్రమే వసూలు చేస్తుండగా.. ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యతను హెచ్ఎండీఏనే చూస్తోంది. ఇది తలకు మించిన భారం కావడంతో లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వడం వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేయడంతో పాటు సంబంధిత ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్దం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్, దాని సంబంధిత ఆస్తుల ద్వారా వస్తున్న రెవెన్యూను అంచనా వేయడంతో పాటు ట్రాఫిక్ ఎంత ఉంది, భవిష్యత్‌లో ఎంత మేరకు పెరగవచ్చు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, రోడ్ సేఫ్టీ ఫీచర్లు, రోడ్ల అభివృద్ధికి ఎంత ఖర్చు చేయాలో కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుంది.

హెచ్ఎండీఏ లీజుకు ఇవ్వబోయే సంస్థ కేవలం టోల్ వసూలు చేయడమే కాకుండా.. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ప్రమాదాలు జరిగిన సమయంలో క్లియరెన్స్, రిపేర్లు, రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా చేపట్టాల్సి ఉంది. ఓఆర్ఆర్ ఆస్తులను కాపాడటం, కబ్జాలు జరగకుండా చూడటం కూడా లీజు సంస్థ బాధ్యతే అని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఆర్‌ను టీవోటీ (టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్) బేస్ మీద ఇవ్వడం వల్ల మరింత రెవెన్యూ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే టీవోటీ పద్దతిని నేషనల్ హైవే అథారిటీ విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 20 ఏళ్లు లీజుకు ఇస్తే రూ.4,000 కోట్లు, 30 ఏళ్లు లీజుకు ఇస్తే రూ.6,000 కోట్లు జనరేట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే హెచ్ఎండీఏ టెండర్లను ఆహ్వానిస్తుందని అధికారులు చెబుతున్నారు.

First Published:  19 Sept 2022 10:37 AM IST
Next Story