Telugu Global
Telangana

వృత్తి కులాలకు రూ.1 లక్ష సాయం చారిత్రాత్మక నిర్ణయం : మంత్రి జగదీశ్ రెడ్డి

2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో అచేతనంగా మారిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోశారని ప్రశంసించారు. కుల వృత్తిదారులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

వృత్తి కులాలకు రూ.1 లక్ష సాయం చారిత్రాత్మక నిర్ణయం : మంత్రి జగదీశ్ రెడ్డి
X

వృత్తి కులాలకు రూ.1 లక్ష చొప్పున సాయం చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల వృత్తులు చేసుకునే వారికి రూ.1 లక్ష సాయంగా ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల మేదర సంఘం సూర్యపేట జిల్లా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా మంత్రి జగదీశ్ రెడ్డిని కలిశారు. తమ ధన్యవాదాలను సీఎం కేసీఆర్‌కు చేరవేయాలని వేయాలని, ఈ నిర్ణయం వృత్తుల వికాసానికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఎంతగానో దోహద పడుతుందని కుల సంఘాల నేతల చెప్పారు.

ఈ సందర్భంగా మేదర సంఘం నాయకులతో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. 2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో అచేతనంగా మారిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోశారని ప్రశంసించారు. కుల వృత్తిదారులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తున్నదని చెప్పారు.

కుల వృత్తులు చేపట్టి జీవనోపాధి పొందుతున్న ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలోపేతం కావాలనే రూ.1 లక్ష సాయం అందిస్తోందని అన్నారు. దీన్ని ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో మేదర సోదరులు వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవాలని, ఆర్థికంగా వృద్ధి చెందాలని మంత్రి జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు.

ఇప్పటికే కుల వృత్తులు కొనసాగిస్తున్న మేదరులకు వెదురుతో గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరింత భారీగా వ్యాపారం చేయాలని భావించిన వారికి రూణాలను కూడా మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇదే విధంగా మిగిలిన కుల వృత్తుల అభ్యున్నతికి కూడా ప్రత్యేక ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.


First Published:  31 May 2023 2:54 PM IST
Next Story