కేసీఆర్ మనవడిని కదా.. ఏదీ నార్మల్ గా చేయను
చదువులో గ్రేడ్ తగ్గినా పర్వాలేదు, వందమందికి సాయం చేసే అవకాశం మాత్రం వదులుకోవద్దని తండ్రి కేటీఆర్ తనతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు హిమాన్షు. తన కుటుంబం, స్నేహితుల వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
"కేసీఆర్ మనవడిని కదా.. ఏదీ నార్మల్ గా చేయడం నాకు అలవాటు లేదు, గొప్పగా చేయాలన్నదే నా ఆలోచన" అని అన్నారు హిమాన్షు. దాదాపు కోటి రూపాయల నిధులతో హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలను కలవడం, వారికి ఆధునిక వసతులు కల్పించడం సంతోషంగా ఉందని చెప్పారు.
గోడలు కట్టించాలని వచ్చా..
కేశవనగర్ స్కూల్ కి ప్రహరీగోడ కట్టించాలనే ఉద్దేశంతో తాను మొదటిసారి ఇక్కడకు వచ్చానని, కానీ ఇక్కడి సమస్యలు చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు హిమాన్షు. ఆడపిల్లలకు సరైన బాత్ రూమ్ లు లేవని.. స్కూల్ లో మెట్లు కూడా సరిగా లేవన్నారు. అందుకే స్కూల్ గోడలతో పాటు ఇక్కడ అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. తాను సేకరించిన నిధులతో పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ పనులు పూర్తయిన తర్వాత సరికొత్తగా మారిన పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు హిమాన్షు. తొలిసారి ఇక్కడే తాను పబ్లిక్ స్పీచ్ ఇస్తున్నానని, కానీ తనకు కొత్తవారితో మాట్లాడుతున్నట్టు లేదని, తన కుటుంబం ముందు మాట్లాడుతున్నట్టుగా ఉందని చెప్పారు.
తాత, నాన్న ఏం చెప్పారంటే..?
ఈ స్కూల్ అభివృద్ధి పనులకు తన తాత కేసీఆర్ స్ఫూర్తి అని చెప్పారు హిమాన్షు. చదువుకున్న సమాజంలో పేదరికాన్ని అరికట్టే ఉపాయం ఉంటుందని ఆయన తనతో తరచూ చెప్పేవారని గుర్తు చేశారు. అందుకే ఈరోజు ఈ స్కూల్ కి సహాయం చేశానన్నారు. చదువులో గ్రేడ్ తగ్గినా పర్వాలేదు, వందమందికి సాయం చేసే అవకాశం మాత్రం వదులుకోవద్దని తండ్రి కేటీఆర్ తనతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు హిమాన్షు. తన కుటుంబం, స్నేహితుల వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
దాదాపు ఏడాదిగా అప్పుడప్పుడు ఈ స్కూల్ కి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షించి వెళ్లేవారు హిమాన్షు. తన స్కూల్ తరపున చేసిన ఈవెంట్ల ద్వారా సేకరించిన నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ కూడా సేకరించారు. కేశవనగర్ స్కూల్ ని ఓ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దారు. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు అంటూ సోషల్ మీడియాలో హిమాన్షుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.