అశోక్ నగర్‌లో హై టెన్షన్.. గ్రూప్-1 అభ్యర్థులు అరెస్ట్
ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అశోక్ నగర్‌లో శాంతియుత నిరసన తెలుపుతున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జీఓ నెంబర్ 29ని రద్దు చేసిన తర్వాతే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైదరాబాద్‌లోని చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే పరీక్షను వాయిదా వేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ముషీరాబాద్ గాంధీ నగర్ పార్కులో గ్రూప్ 1 అభ్యర్థులు శాంతియుత నిరసన చేపట్టారు.
ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సాయంత్రం చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అభ్యర్థులు ధర్నాకు సిద్దమైనట్లు సమాచారం రావడంతో పోలీసులు లైబ్రరీ వద్దకు చేరుకుని ధర్నా అడ్డుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పొడవైన భారీ కర్రలతో పోలీసులు లైబ్రరీ వద్ద తిరుగుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తక్షణమే వాయిదా వేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు పట్టుకొని అభ్యర్థులు నిరసన తెలిపారు.