Telugu Global
Telangana

నాగార్జున సాగర్ వ‌ద్ద‌ ఉద్రిక్తత.. ఎందుకీ వివాదం..?

ఇవాళ ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు డ్యామ్‌ దగ్గరకు చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారని సమాచారం. కుడి కాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది.

నాగార్జున సాగర్ వ‌ద్ద‌ ఉద్రిక్తత.. ఎందుకీ వివాదం..?
X

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వ‌ద్ద యుద్ధ వాతావారణం నెలకొంది. రెండో రోజూ డ్యామ్ దగ్గర పోలీసుల పహారా కొనసాగుతోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్యామ్‌కు ఇరువైపులా వందలాది మంది పోలీసుల మోహరింపుతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

డ్యామ్ దగ్గరికి ఇరు రాష్ట్రాల అధికారులు

ఇవాళ ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు డ్యామ్‌ దగ్గరకు చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారని సమాచారం. కుడి కాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే ఛాన్సుంది.

అసలేంటీ వివాదం..?

రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ చూసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే చూసుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఏపీలోనే ఉన్నాయి.

కుడి కాల్వ‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కూడా నీళ్లను తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది.

First Published:  1 Dec 2023 11:43 AM IST
Next Story