Telugu Global
Telangana

హై రైజ్ భవనాల్లో ఢిల్లీని వెనక్కు నెట్టిన హైదరాబాద్

ప్రస్తుతం హైదరాబాద్‌లో 48 నుంచి 59 అంతస్థుల వరకు కలిగిన బహుళ అంతస్థుల భవనాలు 10 నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణం మొదలు కావడంతో హైరైజ్‌ భవనాలు అధికంగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ దేశ రాజధాని ఢిల్లీని అధిగమించి రెండో స్థానానికి చేరుకుంది.

హై రైజ్ భవనాల్లో ఢిల్లీని వెనక్కు నెట్టిన హైదరాబాద్
X

హై రైజ్ భవనాల్లో ఢిల్లీని వెనక్కు నెట్టిన హైదరాబాద్

ఆకాశానికి నిచ్చెన వేశారా అన్నట్టుగా ఉండే బహుళ అంతస్తుల భవనాలు.. నగరాలకు మరింత వన్నె తెస్తాయి. అలాంటి ఆకాశ హర్మ్యాలతో హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. దేశంలో బహుళ అంతస్తుల(హైరైజ్) భవనాల్లో ముంబై తర్వాతి స్థానం హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ లిస్ట్ లో ఢిల్లీని హైదరాబాద్ వెనక్కు నెట్టింది.

ఆరేడు అంతస్తుల్లో అపార్ట్ మెంట్ అంటే తలపైకెత్తి చూసి అబ్బో అనుకుంటాం. అలాంటిది 20, 30 అంతస్తుల బిల్డింగ్ లను చూస్తే ఆహా అనిపిస్తుంది. అంతకు మించిన ఎత్తయిన భవనాలు ఎక్కడో ఒకటి ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో పేరున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ హై రైజ్ బిల్డింగ్ లను నిర్మించే పనిలో పడ్డాయి. తమ సంస్థ పేరుని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేవి ఈ ఆకాశ హర్మ్యాలే అని నమ్ముతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 48 నుంచి 59 అంతస్థుల వరకు కలిగిన బహుళ అంతస్థుల భవనాలు 10 నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 9 భవనాలు ఐటీ కారిడార్‌ పరిధిలోని కోకాపేట, పుప్పాల్‌ గూడ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. మరో బిల్డింగ్ శేరిలింగంపల్లి ప్రాంతంలో నిర్మితమవుతోంది. వీటి నిర్మాణం మొదలు కావడంతో హైరైజ్‌ భవనాలు అధికంగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ దేశ రాజధాని ఢిల్లీని అధిగమించి రెండో స్థానానికి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం ముంబై తర్వాత హైదరాబాద్‌ లోనే హైరైజ్‌ భవనాలు అధికంగా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలోనే పేరున్న నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ హైదరాబాద్ కి క్యూ కడుతున్నాయి. నివాస భవనాలతోపాటు, వివిధ కంపెనీలకు అద్దెకు ఇచ్చేందుకు కమర్షియల్ బిల్డింగ్ లను కూడా ఆయా సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పుప్పాల గూడలో నిర్మిస్తున్న 59 అంతస్తుల బిల్డింగ్ అతి పెద్దది. 2029 మార్చి నాటికి ఈ బిల్డింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల బిల్డింగ్ లు 2026నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆలోపు మరిన్ని భవనాలకు శంకుస్థాపనలు జరిగే అవకాశముంది. బహుళ అంతస్తుల విషయంలో హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీని సైతం వెన్కకు నెట్టడం విశేషం.

First Published:  29 Aug 2023 11:23 AM IST
Next Story