Telugu Global
Telangana

ఫాంహౌస్ నిందితులకు హైకోర్టు షాక్‌

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్‌ మరోసారి తమ వాదన వినాలని కోరారు. అందుకు హైకోర్టు అంగీకరించగా... ఈ కేసులో చాలా కీలకమైనదని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని.. నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు

ఫాంహౌస్ నిందితులకు హైకోర్టు షాక్‌
X

ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన చర్చల వ్యవహారంలో హైకోర్టులో వెంట‌వెంట‌నే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితులను ఏసీబీ కోర్టు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వారిని కస్టడీకి ఇవ్వాలని కోరారు. తొలుత ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రతికూలంగా స్పందించింది.

అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు దాన్ని ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్ట్‌లను కూడా ఏసీబీ మాత్రమే చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీసీ యాక్ట్ కింద కేసు పెడితే ఏసీబీ రూల్స్‌ను ఫాలో కావాల్సిందేనని తేల్చింది. పీసీ యాక్ట్ కింద రిమాండ్ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఉండదని స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కూడా సమర్థిస్తూ సైబరాబాద్ పోలీసుల పిటిషన్‌ను తోసిపుచ్చేందుకు ఒక దశలో దాదాపు సిద్ధమైంది.

అయితే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్‌ మరోసారి తమ వాదన వినాలని కోరారు. అందుకు హైకోర్టు అంగీకరించగా... ఈ కేసులో చాలా కీలకమైనదని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందని.. నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు. దాంతో హైకోర్టు ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు తీర్పును కొట్టివేసింది. నిందితులను 24 గంటల్లోగా అదుపులోకి తీసుకుని తిరిగి కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. నిందితులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టత ఇచ్చింది. దాంతో మరి కాసేపట్లో నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

First Published:  29 Oct 2022 12:56 PM IST
Next Story