బోగస్ కంపెనీకి 850 ఎకరాలు ధారాదత్తం.. బాధ్యుడైన ఐఏఎస్‌పై చర్యలేవన్న హైకోర్టు
2003లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఐఎంజీకి భూములు కేటాయిస్తూ ఒప్పందం చేసుకుంది. వాటిని ఆ సంస్థకు విక్రయిస్తూ సేల్‌డీడ్ కూడా చేసింది.
ఒకటీ రెండు కాదు ఏకంగా 850 ఎకరాలను ఓ బోగస్ కంపెనీకి ధారాదత్తం చేయడంలో ఓ ఐఏఎస్ అధికారి కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐఎంజీ అకాడమీస్ భారత్‌కు హైదరాబాద్ పరిధిలో 850 ఎకరాలను కేటాయించారు. అర్హత లేని ఆ కంపెనీకి ఏకంగా అంత భూమి కేటాయించడం సరికాదని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే బాధ్యుడైన ప్రిన్సిపల్ సెక్రటరీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
2003లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఐఎంజీకి భూములు కేటాయిస్తూ ఒప్పందం చేసుకుంది. వాటిని ఆ సంస్థకు విక్రయిస్తూ సేల్‌డీడ్ కూడా చేసింది. ఈ ఒప్పందాన్ని, సేల్ డీడ్ ఒప్పందాన్ని తర్వాత 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ ఛైర్మన్ అహోబిలరావు (బిల్లీరావు) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, న్యాయమూర్తి జె.అనిల్‌కుమార్‌ల బెంచ్.. భూములివ్వడంలో కీలకపాత్రధారి అయిన ఐఏఎస్ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.
అది బోగస్ సంస్థ అన్న ఏజీ
అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఐఎంజీ వరల్డ్‌వైడ్ స్పోర్ట్స్ సెంటర్ యాజమాన్యంలోనిదే తమ సంస్థ అంటూ బిల్లీరావు ప్రభుత్వానికి చెప్పారన్నారు. ప్రభుత్వం దాన్ని కనీసం పరిశీలించకుండానే హైదరాబాద్ పరిధిలోని కోట్ల విలువైన భూములను ఎకరా 25వేల నుంచి 50 వేల ధరకే ఆ కంపెనీకి కట్టబెట్టింది. మొత్తం 850 ఎకరాలు కేటాయించింది. అందులో 400 ఎకరాలు కంపెనీ పేరున రిజిస్ట్రేషన్ కూడా చేసిందని చెప్పారు. 11 క్రీడా స్టేడియాలను వీటిలోకి తరలించడానికి కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. అయితే ఇది బోగస్ కంపెనీ అని, ఒప్పందానికి నాలుగురోజుల ముందే ఈ కంపెనీ రిజిస్టరయిందని ఏజీ చెప్పారు.
యూనివర్సిటీ భూములు ఎవర్ని అడిగి ఇచ్చారు?
పైగా ఐఎంజీకి ఇచ్చిన భూముల్లో 400 ఎకరాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందినవని చెబుతున్నారని, వర్సిటీ భూములు ధారాదత్తం చేసే అధికారం ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ఒక ఐఏఎస్ అధికారి తనకు నచ్చినట్లు భూములు పంచేయవచ్చా? ఇంత కాలమవుతున్నా ఆ ఐఏఎస్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఘాటుగా ప్రశ్నించింది.