ఆ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా.. టీ.స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు!
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఆఫీసులో పిటిషన్లు అందించడానికి కూడా అనుమతించలేదన్నారు. హైకోర్టు జోక్యంతోనే స్పీకర్ ఆఫీసులో పిటిషన్లు అందించామన్నారు.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై వివరణ కోరుతూ స్పీకర్‌కు నోటిసులిచ్చారు జస్టిస్ విజయసేన్ రెడ్డి. జూన్ 27లోపు స్పీకర్ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటికే న్యాయశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌లకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఐతే ఇప్పటివరకూ వీళ్లేవరూ కౌంటర్ దాఖలు చేయలేదు.
ఈ కేసులో బీఆర్ఎస్ తరపున సీనియర్ అడ్వకేట్లు గండ్ర మోహన్ రావు, జె.రామచందర్ రావు వాదనలు వినిపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ అధికారులు ఈ సమస్యను పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఆఫీసులో పిటిషన్లు అందించడానికి కూడా అనుమతించలేదన్నారు. హైకోర్టు జోక్యంతోనే స్పీకర్ ఆఫీసులో పిటిషన్లు అందించామన్నారు. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరహాలోనే ఈ కేసులోనూ టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని హైకోర్టును కోరారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. ఈ కేసులో కాంగ్రెస్ తరపున అడ్వకేట్ జనరల్ A.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. స్పీకర్ విషయంలో టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ చేసే అధికారాలు లేవన్నారు సుదర్శన్ రెడ్డి.