రిపబ్లిక్ డే నిర్వహణపై హైకోర్టు మార్గదర్శకాలు.. నెక్స్ట్ ఏంటి..?
విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరపాలని, పరేడ్ కూడా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణలో రిపబ్లిక్ డే నిర్వహణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులున్నాయని ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్ని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించలేమని, వాటిని రాజ్ భవన్ కి పరిమితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరపాలని, పరేడ్ కూడా నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వేదిక ఎక్కడ..?
పరేడ్ నిర్వహించాలంటే పరేడ్ గ్రౌండ్స్ లోనే సాధ్యపడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు రిహార్సల్స్, ఏర్పాట్లు లేకుండా పరేడ్ సాధ్యపడుతుందా, శకటాల ఏర్పాటు ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్ల విషయంలో సైలెంట్ గానే ఉంది. ఇప్పటికిప్పుడు వేడుకలపై కోర్టు ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఆసక్తికర వాదనలు..
రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయంలో హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. ఈనెల 13వ తేదీనే రాజ్ భవన్ కు లేఖ రాశామని.. రాష్ట్రంలో కొవిడ్ ఉన్నందున రాజ్ భవన్ లోనే వేడుకలు జరుపుకోవాలని కోరినట్లు కోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్. రాజ్ భవన్ లో వేడుకలకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని ఏజీ తెలిపారు. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలను ప్రజలు చూసేందుకు వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. అయితే ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది. ఘనంగా వేడుకలు జరపాలని, పరేడ్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.