బైంసాలో 'బండి' యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
బైంసా పట్టణంలో బండి సంజయ్ సభ, పాద యాత్రలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. బైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని వేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, సభకు హాజరయ్యే వారి సంఖ్యను 3 వేలకు పరిమితం చేయాలని హైకోర్టు షరతులు విధించింది.
మతపరంగా సున్నితమైన పట్టణమైన బైంసాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, బహిరంగ సభలకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు జీ. ప్రేమేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు బండి పాద యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బిజెపికి చెందిన జి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి, అనేక షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని వేదిక వద్ద మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, సభకు హాజరయ్యే వారి సంఖ్యను 3 వేలకు పరిమితం చేయాలని హైకోర్టు షరతులు విధించింది.
500 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదనే షరతుతో పాదయాత్రకు కూడా హైకోర్టు అనుమతినిచ్చింది. యాత్రలో పాల్గొనే వారెవరూ కర్రలు, అలాంటి ఏ వస్తువులనూ తీసుకెళ్లకూడదని కోర్టు ఆదేశించింది.
సోమవారం సభ నిర్వహించలేని పక్షంలో మంగళవారం కూడా అవే షరతులతో సభ నిర్వహించవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని, ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే ప్రేమేందర్‌రెడ్డి బాధ్యత వహించాలని హైకోర్టు పేర్కొంది.
అయితే హైకోర్టు షరతులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాటిస్తారా ? మతపరమైన రెచ్చగొట్టే మాటలు లేకుండా బండి సంజయ్ ఉపాన్యాసం ఇవ్వగలరా అనేది సభ అయిపోయాక గానీ తేలదు. కాగా ఈ సభలో మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొంటారు.