బైంసా లో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆరెస్సెస్ నిర్వహించే ర్యాలీలో 500 మందికి మించి పాల్గొనవద్దని, వారెవరికీ ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండటానికి వీలు లేదని కోర్టు షరతులు విధించింది.
నిర్మల్ జిల్లా బైంసాలో RSS నిర్వహించతలపెట్టిన ర్యాలీకి హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఆ ర్యాలీ నిర్వహణకు కొన్ని షరతులు విధించింది కోర్టు.
ఆరెస్సెస్ నిర్వహించే ర్యాలీలో 500 మందికి మించి పాల్గొనవద్దని, వారెవరికీ ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండటానికి వీలు లేదని కోర్టు షరతులు విధించింది. అంతే కాదు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని, మసీదుకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించుకోవాలని, ర్యాలీలో పాల్గొనేవారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని షరతులు విధించింది కోర్టు. మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
కాగా, ఇటీవల శివాజీ జయంతి సందర్భంగా బైంసాలో ర్యాలీ తీయడానికి ఆరెస్సెస్ అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు. దాంతో హైకోర్టును ఆశ్రయించిన ఆరెస్సెస్ మార్చ్ 5న ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆ సంస్థకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోర్టును కోరారు. భైంసా అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతమని, రెండు సంవత్సరాల క్రితం బైంసాలో జరిగిన మత ఘర్షణల వలన ప్రాణ నష్టం జరిగిందని పోలీసుల తరపు లాయర్ కోర్టుకు వివరించారు.
అయితే టిప్పు సుల్తాన్ పుట్టినరోజు ర్యాలీ అనుమతి ఇచ్చిన పోలీసులు ఆరెస్సెస్ ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వరని ఆ సంస్థ తరపున లాయర్ వాదించారు. బైంసా భారత దేశంలో భాగమని అది వేరే దేశంలో లేదని ఆరెస్సెస్ లాయర్ కోర్టులో వాదించారు.
రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆరెస్సెస్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.