Telugu Global
Telangana

మునుగోడులో పెరిగిన ఓట్లపై హైకోర్టుకు బీజేపీ.. చీవాట్లు పెట్టిన ధర్మాసనం

ఓట్లు పెరగడం సాధారణమైన విషయమే కదా? మీకెందుకు తప్పుగా అనిపించిందని బీజేపీ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రచనా రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది.

మునుగోడులో పెరిగిన ఓట్లపై హైకోర్టుకు బీజేపీ.. చీవాట్లు పెట్టిన ధర్మాసనం
X

మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఒక్క సారిగా 25 వేల ఓట్లు పెరిగాయని, ఇవి అధికార టీఆర్ఎస్ పార్టీ నమోదు చేయించిందని బీజేపీ గత కొన్నాళ్లుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టు మెట్లెక్కిన బీజేపీకి చుక్కెదురైంది. ఓటర్లు పెరగడంలో మాకు ఎలాంటి అసాధారణ విషయం కనపడటం లేదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డిల ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓట్లు పెరిగిన విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమర్పించిన స్టేట్మెంట్‌ను పూర్తిగా పరిశీలించాము. ఇలా ఓట్లు పెరగడం సాధారణమైన విషయమే కదా? మీకెందుకు తప్పుగా అనిపించిందని బీజేపీ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రచనా రెడ్డిని ప్రశ్నించింది.

మునుగోడులో 2018 అక్టోబర్ 12 నుంచి 2022 అక్టోబర్ 11 మధ్య ఓటర్ల సంఖ్య 2,14,847 నుంచి 2,38,759కి పెరిగింది. రెండేళ్లలో ఇక్కడ దాదాపు 24 వేల మంది ఓటర్లు పెరిగారు. అయితే, ఈ పెరుగుదలలో ఎలాంటి తప్పు కనిపించలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల వెంకట కృష్ణారెడ్డి ఈ పెరుగులదపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ కావాలని 25 వేల కొత్త ఓట్లను నమోదు చేయించిందని, కేవలం 70 రోజుల వ్యవధిలో ఈ ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు.

కాగా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ దీనిపై పూర్తి స్టేట్మెంట్ కోర్టుకు సమర్పించారు. గత రెండేళ్లకు తమకు 25,013 ఫామ్ 6 అప్లికేషన్లు వచ్చాయని.. అందులో 7,247 తిరస్కరించామని పేర్కొన్నారు. అక్టోబర్ 11 నాటికి 5,517 అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఫామ్ 8 అప్లికేషన్లు 2,142 వచ్చాయని.. వాటిలో 1,813 రిజెక్ట్ చేయగా.. 182 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇక పిటిషనర్ తరపున వాదిస్తున్న రచనా రెడ్డి మాత్రం ఓటర్ల నమోదు విషయంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్ 1960ని అనుసరించలేదని ద్విసభ్య ధర్మాసనానికి తెలిపారు. దీనిపై హైకోర్టు మండి పడింది.

అసలు మీకు ఏమి కోరుకుంటున్నారు? ఎలక్షన్లను హోల్డ్‌లో పెట్టాలని అంటున్నారా లేదా ఓటర్ల లిస్టును ఫ్రీజ్ చేయమని కోరుతున్నారు. ఈ లిస్టులో ఉన్న వాళ్లు ఎవరూ కోర్టు ముందు లేరు. కానీ మీరు మాత్రం ఓటర్ల లిస్టు నుంచి వాళ్లందరినీ తొలగించమని కోరుతున్నారు. మేము అలా చేయలేము. మీరు చెప్పిన స్టేట్మెంట్ నమోదు చేశాము. ఈ రిట్ పిటిషన ప్రస్తుతానికి కొట్టేయకుండా అలాగే ఉంచుతాము. ఒక వేళ ప్రత్యర్థి భారీ మెజార్టీతో గెలిస్తే ఈ పిటిషన్ రద్దుఅవుతుంది. అలా కాకుండా స్వల్ప మెజార్టీతో గెలిస్తే అప్పుడు తిరిగి విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 21 లోగా ఓటర్ల లిస్టును ప్రచురించాలని ఎలక్షన్ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

First Published:  15 Oct 2022 7:48 AM IST
Next Story