ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు ఖాయమేనా?
దానం, కడియం, తెల్లం భవిత్యవమేంటి
బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆ ముగ్గురిపై వేటు ఖాయమేనా? హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ఏమి తీర్పునివ్వబోతుంది? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తర్వాత ముగ్గురు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచిస్తూ సెప్టెంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి, లా సెక్రటరీ తరపున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున శ్రీరఘురాం, మయూర్ రెడ్డి, జంధ్యాల రవిశంకర్, బీఆర్‌ఎస్ తరపున గండ్ర మోహన్ రావు, బీజేఎల్పీ నేత తరపున ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈనెల 12న ఈ పిటిషన్‌లపై వాదనలు ముగియడంతో సీజే బెంచ్ తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును శుక్రవారం వెలువరించనుంది.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని గతంలోనే సుప్రీం కోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు తీర్పులు వెలువరించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగానే తీర్పునిచ్చే అవకాశముందని తెలుస్తోంది. అప్పీల్ లో అసెంబ్లీ సెక్రటరీ చర్యలు తీసుకునేందుకు స్పీకర్ కు తగినంత సమయం ఇవ్వకుండానే హైకోర్టుకు వెళ్లారని మాత్రమే పేర్కొన్నారు. ఈ లెక్కన చర్యలు తీసుకోవడానికి స్పీకర్ సైతం సిద్ధంగా ఉన్నారని.. అందుకు తగినంత సమయం మాత్రం ఇవ్వలేదనేది పిటిషనర్ వాదనగా ఉంది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించే సమయంలో ఏజీ స్పీకర్ ను కోర్టులు డైరెక్ట్ చేయలేవని వాదించారు. స్పీకర్ ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కాబట్టే ఆ పార్టీకి లాభం చేసేలా తన విధుల నిర్వహణలో సాగదీత ధోరణి అనుసరిస్తున్నారని డిఫెండెంట్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు చేసేందుకు తాము అపాయింట్‌మెంట్ కోరినా స్పీకర్ కనీసం టైం ఇవ్వలేదని బీజేపీ శాసనసభ పక్షనేత తరపున అడ్వొకేట్ వాదించారు. ఈనేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఎలాంటి తీర్పునివ్వబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకవేళ ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిస్తే మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవు. అలాగే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్సీలపై బీఆర్‌ఎస్ న్యాయపోరాటానికి దిగడం ఖాయం.