ఫంక్షన్ హాళ్లలో సౌండ్ కంట్రోల్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారు?
సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్, బోయిన్‌పల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజినీరు కల్నల్ జె. సతీశ్ భరద్వాజ్ హైకోర్టుకు లేఖ రాశారు.
ఫంక్షనంటే డీజే మోగాల్సిందే. చెవులు చిల్లులు పడేలా వచ్చే సౌండ్‌కు తీన్మార్ డ్యాన్స్‌లు ఆడాల్సిందే. అయితే అది తమకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని చుట్టుపక్కలవాళ్లు ఎంత మొత్తుకున్నా నియంత్రించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఫంక్షన్ హాళ్లలో శబ్ద నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం ఓ పదివేలు ఫైన్ వేసి, నామమాత్రపు కేసులు పెట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. శబ్ద నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటేనే ఫలితాలు కనిపిస్తాయని పేర్కొంది.
హైకోర్టుకు ఆర్మీ అధికారి లేఖ
సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్, బోయిన్‌పల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల వల్ల పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజినీరు కల్నల్ జె. సతీశ్ భరద్వాజ్ హైకోర్టుకు లేఖ రాశారు. అర్ధరాత్రి 12 గంటలు దాటినా పెద్ద పెద్ద శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని, మరోవైపు పార్కింగ్ సమస్య ఏర్పడుతోందని చెప్పారు. ఖాళీ మద్యం సీసాలు, ఆహార వ్యర్థాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని లేఖలో పేర్కొన్నారు. 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా తాత్కాలికంగా వచ్చివెళుతున్నారని.. కఠిన చర్యలు తీసుకోవడంలేదని వివరించారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టింది.
సమాధానం చెప్పడానికి గడువు కావాలన్న ఏఏజీ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ఈ పిల్ మీద విచారణ ప్రారంభించింది. ఫంక్షన్ హాళ్లలో సౌండ్ కంట్రోల్‌పై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వ వివరణ తీసుకుని చెప్పడానికి టైమ్ కావాలని అడిషినల్ అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు.