Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి భద్రత పెంపు.. హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రస్తుతం 69మందితో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. అయితే ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.

రేవంత్ రెడ్డికి భద్రత పెంపు.. హైకోర్టు ఆదేశం
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలంటూ తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర లో పాల్గొంటున్న ఆయనకు మరింత భద్రత పెంచాలని చెప్పింది. అదనపు భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్‌ రెడ్డి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు తాజాగా మరోసారి విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రస్తుతం 69మందితో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. అయితే ఆ భద్రత అంతా ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. తగిన భద్రత లేకపోవడం వల్ల పాదయాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని కోర్టుకి విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు రేవంత్‌ రెడ్డికి భద్రత పెంచాలని స్పష్టం చేసింది. పాదయాత్రతో పాటు రేవంత్‌ రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల హాథ్ సే హాథ్ జోడో యాత్రలో అక్కడక్కడా సవాళ్లు, ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. కొన్నిసందర్భాల్లో ఇరు వర్గాలు కలబడిన ఉదాహరణలున్నాయి. భూపాలపల్లి ఘటన నేపథ్యంలో తనకు భద్రత పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. దీనిపై స్పందించిన న్యాయస్థానం భద్రత పెంచాలంటూ ఉత్తర్వులిచ్చింది.

First Published:  6 March 2023 2:31 PM GMT
Next Story