పంద్రాగస్ట్ వేళ.. హైదరాబాద్‌లో హై అలర్ట్..
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచారు.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్య పట్టణాలను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఢిల్లీ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఆంక్షలు పెంచారు. ఐదు రోజుల ముందుగానే పోలీసులు నగరాన్ని జల్లెడపడుతున్నారు. చారిత్రక కట్టడాలు, వీఐపీల నివాసాల వద్ద భద్రత పెంచారు.
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచారు. అనుమానితులెవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
ఢిల్లీలో అత్యంత భారీ భద్రత..
ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. 25 నుంచి 30 కిలోల బరువున్న ఐఈడీని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్మానుష్య ప్రదేశంలో అధికారులు పేల్చివేశారు. ఇక ఢిల్లీలో కూడా అల్లర్లు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీతోపాటు కీలక నగరాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఆయా నగరాల్లో భద్రతా దళాలు నిఘా పెంచాయి. ఢిల్లీలో 10 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగే ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షూటర్లను మోహరిస్తున్నారు. నగరంలో నో ఫ్లయింగ్ జోన్లు అమలు చేస్తున్నారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగుర వేయకుండా నిషేధం విధించారు. ఢిల్లీలో వెయ్యికిపైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.