తెలంగాణ వాసులకు హెచ్చరిక.. రాబోయే 5రోజులు జాగ్రత్త
మోచా తుపాను ప్రభావం తప్పిపోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండవేడి పెరుగుతోంది. పిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం వేళ బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
తుపాను ముప్పు తప్పిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో హీట్ వేవ్ కొనసాగుతోందని, దీని ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS). రాబోయే ఐదు రోజుల్లో హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది.
ఒక్కరోజు ఉష్ణోగ్రత 40డిగ్రీలు దాటితేనే హడలిపోతాం. అలాంటిది వరుసగా ఐదురోజులపాటు 40కంటే ఎక్కువగా 46 డిగ్రీలకు దగ్గర్లో ఉష్ణోగ్రతలంటే కచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. వారం రోజుల క్రితం హైదరాబాద్ తో పాటు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. అటు రైతులు నష్టపోయారు, ఇటు నగరవాసికి వర్షాలతో కాస్త ఉపశమనం దక్కింది. రాబోయే ఐదు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు.. జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, కుమ్రం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశముంది.
మోచా తుపాను ప్రభావం తప్పిపోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండవేడి పెరుగుతోంది. పిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం వేళ బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తప్పనిసరి అవసరం ఉంటేనే ప్రయాణాలకు సిద్ధపడాలని చెబుతున్నారు. విహార యాత్రలకు వెళ్లేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.